పంచాయతీ ఎన్నికల.. గుర్తులు వచ్చేశాయ్
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:05 AM
పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం వంటివి పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టారు.

- సర్పంచులకు 30.. వార్డు సభ్యులకు 20
- నోడల్ అధికారుల నియామకం
- 2268 పోలింగ్ కేంద్రాలు
- మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు
- జిల్లాలో 260 సర్పంచ్, 2268 వార్డు సభ్యుల స్థానాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం వంటివి పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టారు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తులను ప్రకటించింది. బ్యాలెట్ ముద్రణకు జిల్లా స్థాయిలో సన్నాహాలు కూడా చేస్తున్నారు. సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్లు ప్రారంభమయ్యే నాటికి 50 శాతం బ్యాలెట్ పేపర్లు ముద్రించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం కలెక్టర్ నోడల్ అధికారులను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచుల స్థానాలకు, 2268 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ప్రకటన రావడంతోనే ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల గుర్తులు కూడా రావడంతో జిల్లాలోని పల్లెల్లో హడావుడి పెరిగింది.
ఎన్నికల గుర్తులు ఇలా?
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులను కేటాయించారు. సర్పంచులకు సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సర్పంచుల ఎన్నికల గుర్తుల్లో ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, పాన్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, వజ్రం, నల్ల బోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, చేతికర్ర, మంచం, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలిబుడగ వంటివి ఉన్నాయి. వార్డు సభ్యులకు సంబంధించి పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలెండర్, గౌన్, ఈల, కుండ, గరాట, ముకుడు, డిష్ ఏంటీనా, ఐస్‌క్రీమ్, గాజు గ్లాస్, పోస్ట్ డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నైక్ టై, విద్యుత్ స్తంభం, షటిల్, గుర్తులు కేటాయించారు. గుర్తుల్లో కొన్ని గుర్తుంచుకోవడం కష్టమే అన్నట్లు భావిస్తున్నారు.
3.46 లక్షల మంది పంచాయతీ ఓటర్లు
పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతకుమించి ఓటర్లు ఉంటే రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రీసైడింగ్ అధికారి ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400వరకు ఒక ప్రీసైడింగ్ అధికారి ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉంటే ప్రీసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమిస్తున్నారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉన్నవి 1734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు ఉన్నవి 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్నవి 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 260 గ్రామ పంచాయతీల్లో 2268 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది సెప్టెంబరులోనే గ్రామ పంచాయతీ ఓటర్ల లెక్కను తేల్చి జాబితాలను వెల్లడించారు. జిల్లాలో 12 మండలాలు, 260 గ్రామ పంచాయతీల పరిధిలో 3 లక్షల 46 వేల 259 ఓటర్లు ఉన్నట్లు లెక్కతేల్చారు. ఇందులో పురుషులు 1,67,686 మంది, మహిళలు 1,78,553 మంది ఉన్నారు. 20 జెండర్ల ఓట్లు ఉన్నాయి. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం ఈ సారి 33 వేల 765 ఓటర్లు పెరిగారు. గత ఎన్నికల్లో 3,12,494 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,52,942 మంది ఉండగా ఈ సారి 14,744 మంది పెరిగారు. మహిళలు గత ఎన్నికల్లో 1,59,535 ఉండగా ఈ సారి 19,018 మంది పెరిగారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. తుది ఓటరు జాబితా ప్రకారం 3,46,259 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలే 1,78,553 మంది ఉన్నారు. పురుషులు 1,67,686 మంది ఉన్నారు. మహిళలే అధికంగా 10,867 మంది ఉన్నారు. దీంతో మహిళల ఓటింగ్ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి.
రిజర్వేషన్ల ఖరారుతోనే ఎన్నికలు
ప్రభుత్వం జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించడంతోపాటు సర్వే కూడా చేపట్టింది. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. బీసీ జనాభా లెక్కలు తేలిన తరువాత ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. సంక్రాంతి తరువాత ఎన్నికలు ముందుకొస్తాయని భావిస్తున్నారు. జిల్లాలో 219 సంవత్సరంలో మూడు విడతల్లో 255 గ్రామ పంచాయతీలు 2240 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. 255 సర్పంచ్ స్థానాల్లో 126 జనరల్ కాగా 129 మహిళలకు కేటాయించారు. 115 జనరల్ స్థానాల్లో మహిళలకు 58 కాగా 57 జనరల్‌కు కేటాయించారు. 25 గిరిజనులకు ముందే రిజర్వ్ చేయగా ఆ స్థానాల్లో 13 మహిళలకు, 12 జనరల్ ఉన్నాయి. మరో 6 రిజర్వ్ స్థానాల్లో 3 మహిళలకు, 3 జనరల్‌కు కేటాయించారు. ఎస్సీలకు 52 కేటాయించగా 26 జనరల్ 26 మహిళలకు ఉన్నాయి. బీసీలకు 57 కేటాయించగా మహిళలకు 29, జనరల్‌కు 28 ఉన్నాయి. ఈ సారి రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు వస్తాయని భావిస్తున్నారు. 2018లో రూపొందించిన పంచాయతీరాజ్ చట్ట పవరణలో 34 శాతం నుంచి 23 శాతానికి బీసీ రిజర్వేషన్లు తగ్గించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితి ఉండడంతో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. 44 శాతం పోను మిగిలిన 6 శాతం బీసీలకు కేటాయిస్తారని భావిస్తున్నారు. బీసీలకు 6 శాతం కేటాయిస్తే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల స్థానాలు మారనున్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల సందడితో ఆశావహుల రాజకీయాలు కూడా మొదలయ్యాయి.