పల్లెల్లో సందడి...
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:14 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికలకు పార్టీల గుర్తుల ప్రమేయం లేకపోయినా మద్దతు ఉంటే బలం పెరగడం, ఎన్నికల ప్రచారంలో క్యాడర్ కూడా కలిసి వస్తుందని ఆశావహులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీ పడడానికి అన్ని వర్గాలను పలకరిస్తూ ఆశావహులు తిరుగుతున్న తీరుతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సందడి మొదలైంది. ఈనెల 15వ తేది వరకు పంచాయతీ నోటిఫికేషన్ వస్తుందని ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులపై దృష్టి పెట్టాయి. పంచాయతీ కార్యదర్శులకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరం అయితే ఆధార పత్రాలు ఉంటే సెలవులు మంజూరుచేయనున్నారు. కులగణనపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ అసెంబ్లీ కూడా నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల ఖరారుతోనే ఎన్నికలకు ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జిల్లాలో ఇప్పటికే అధికార యంత్రాంగం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతోనే నిర్వహణకు సర్వంసిద్ధం చేసింది. 2019 గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించింది. ఈసారి కూడా మొదట్లో మూడు విడతలుగా ఏర్పాటు చేసినా రెండు విడతల్లోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు, వాటిలో మొదటి విడతలో 137 సర్పంచ్‌లు, 1888 వార్డులు, రెండవ దశలో 123 గ్రామాలు, 1080 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఎన్నికల వైపు పార్టీల దృష్టి..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తుండడంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను సన్నద్ధం చేయడానికి దృష్టి సారించాయి. అధికార పార్టీ కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికలు సవాల్‌గానే మారనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహాలక్ష్మీ పథకాలపై ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో రైతులు, మహిళలు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అభ్యర్థులు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. 90 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవాలనే దానిపై దృష్టి సారించారు. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సత్తా చాటాలని భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందినవారే స్థానిక సంస్థల్లో గెలుపొందారు. తిరిగి మళ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని గ్రామస్థాయి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా ఉన్న వేములవాడ, సిరిసిల్ల రెండు నియోజకవర్గాల్లో వేములవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావులు ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో విభిన్నమైన పరిస్థితులు ఉండడంతో ఫలితాలు ఎలా రాబోతాయనే ఆసక్తి గ్రామీణ ఓటర్లలో నెలకొంది.
ఓటరు జాబితా సిద్ధం..
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు కీలకంగా ఉండే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. 260 గ్రామ పంచాయతీల్లో 3 లక్షల 46 వేల 259 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో పురుషులు 167686 మంది, మహిళలు 178553 మంది, 20 మంది జెండర్ ఓట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉండే పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించనున్నారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలు 134 ఉండగా, 400 ఓటర్లు ఉన్న కేంద్రాలు 468 ఉండగా, 650 ఓటర్లు ఉన్నవి 76 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే సిబ్బంది నియామకాలను పూర్తి చేశారు.
బ్యాలెట్ పేపర్లు సిద్ధం..
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్‌లకు సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్‌ల ఎన్నికల గుర్తుల్లో ఉంగరం, కత్తెర, పుట్‌బాల్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, పాన్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, వజ్రం, నల్ల బోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, చేతికర్ర, మంచం, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలిబుడగ తదితర గుర్తులు ఉన్నాయి. వార్డు సభ్యులకు సంబంధించి పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ, గరాట, మూకుడు, డిష్‌యాంటీనా, ఐస్‌క్రీమ్, గాజు గ్లాస్, పోస్ట్ డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నెక్ టై, విద్యుత్ స్తంభం, షటిల్, గుర్తులు కేటాయించారు. గుర్తుల్లో కొన్ని గుర్తుంచుకోవడం కష్టమే అన్నట్లుగా భావిస్తున్నారు.
ఫ జిల్లాలో పురుషులు, మహిళల ఓట్లు...
మండలం పురుషులు మహిళలు మొత్తం
బోయినపల్లి 14681 15595 30276
చందుర్తి 13220 14394 27614
ఇల్లంతకుంట 19391 20512 39903
గంభీరావుపేట 17543 18639 36183
కోనరావుపేట 16795 17666 34461
ముస్తాబాద్ 18529 19613 38142
రుద్రంగి 6234 7006 13243
తంగళ్లపల్లి 18372 19432 37804
వీర్నపల్లి 5713 5836 11549
వేములవాడ 8877 9296 18189
వేములవాడరూరల్ 8914 9699 18613
ఎల్లారెడ్డిపేట 19417 20865 40282
----------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 167686 178553 346259 (జెండర్ 20)
-----------------------------------------------------------------------------------------------------------------------------