కొత్తపల్లి స్థానంలో కొత్త మండలం
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:40 AM
జిల్లాలో బావుపేట, ఎలగందల్ పేరిట కొత్త మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసిన తర్వాత ఈ ప్రతిపాదనతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు.
- తెరపైకి వచ్చిన రెండు గ్రామాల డిమాండ్లు
- చారిత్రక నేపథ్యం ఉందంటున్న ఎలగందల్
- పెద్ద గ్రామంగా, అనువైన కేంద్రంగా ఉన్నామంటున్న బావుపేట
- మంత్రి ‘పొన్నం’దే తుది నిర్ణయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో బావుపేట, ఎలగందల్ పేరిట కొత్త మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసిన తర్వాత ఈ ప్రతిపాదనతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్తపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసిన నాటి నుంచే అత్యధిక జనాభా ఉన్న బావుపేటను మండల కేంద్రం చేయాలని అక్కడి ప్రజలు కోరుతూ వస్తుండగా, చారిత్రక నేపథ్యంతోపాటు పెద్ద పంచాయతీగా ఉన్న ఎలగందల్‌ను మండల కేంద్రం చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ మండలంలో ఒక పంచాయతీగా ఉన్న కొత్తపల్లిని జిల్లాల విభజన తర్వాత మండల కేంద్రంగా మార్చారు. ఆ తర్వాత దీనిని మున్సిపాలిటీగా ప్రకటించారు. తాజాగా ఈ మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంచాయతీగా ఉన్న కొత్తపల్లి మండలంగా, మున్సిపాలిటీగా మారి చివరకు కార్పొరేషన్‌లో విలీనం కావడంతో దాని పేరిటే మండల కేంద్రం ఉండడంలో ఔచిత్యం లేదని ప్రజలు భావిస్తున్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు ఆ మండలంలో ఉన్న చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో మండలంలో మిగిలిన మిగతా గ్రామాలతోపాటు గంగాధర మండలంలోని ఒద్యారం గ్రామ పంచాయతీని కూడా ఈ మండలంలోనే విలీనం చేస్తూ కొత్త మండల కేంద్రం ప్రకటించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బావుపేట కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని కొందరు, ఎలగందల్ కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తూ ప్రయత్నాలు ప్రారంభించారు. బావుపేట పంచాయతీకి చెందిన ప్రజలు ఇటీవల ఇదే డిమాండ్‌తో ధర్నా చేయడమే కాకుండా ఒక ప్రతినిధి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు వెళ్లి తమ పంచాయతీని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఎలగందల్ గ్రామస్థులు మండలంలోనే పెద్ద పంచాయతీగా ఉండడమే కాకుండా తమకున్న చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని మండల కేంద్రంగా ఎలగందల్‌ను ప్రకటించాలని కోరుతున్నారు. కుతుబ్‌షాహి వంశం, మొఘల్ సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం హయాంలో ఎలగందల్ కేంద్రంగా జిల్లా ఉండేదని, ఎలగందల్ కోట జిల్లా ప్రధాన కార్యాలయంగా పాలన నిర్వహించేదని చరిత్ర చెబుతున్నది. 1905లో ఎలగంగల్ ఖిలాదార్ సయ్యద్ కరీమొద్దీన్ పేరిట కరీంనగర్ జిల్లాగా దీనిని ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాన్ని కరీంనగర్‌కు తరలించారు. ఆ తర్వాత ఎలగందల్ ఖిల్లా టూరిజం ప్రాంతంగా మిగిలిపోయింది. ఒకప్పటి జిల్లా కేంద్రం అయిన ఎలగందల్‌ను మండలంగా మార్చితే చారిత్రక నేపథ్యాన్ని కాపాడినవారమవుతామని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఆసిఫ్‌నగర్(బావుపేట), ఎలగందల్, కమాన్‌పూర్, ఖాజీపూర్, నాగులమల్యాల, బద్దిపల్లి, ఒద్యారం గ్రామ పంచాయతీలతో మండలాన్ని పునర్వ్యవస్థీకరించి మండల కేంద్రంగా బావుపేటను కాని, ఎలగందల్‌ను కాని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ బావుపేట, ఎలగందల్‌లో దేనివైపు మొగ్గుచూపుతారో అన్నదానిపైనే మండలం ఏర్పాటు ఆధారపడి ఉన్నదని భావిస్తున్నారు. త్వరలోనే కొత్తపల్లి మండలం స్థానంలో కొత్త మండలం ఏర్పడటం ఖాయం అనే చర్చ నడుస్తోంది.