Share News

నత్తనడకన రైల్వే బ్రిడ్జి పనులు

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:09 AM

కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్‌ పంథకం కింద 154 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రెండు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభమయ్యాయి.

నత్తనడకన రైల్వే బ్రిడ్జి పనులు

కరీంనగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 11: కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్‌ పంథకం కింద 154 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రెండు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. భూ సేకరణలో జాప్యంతో పనులు ముందుకు సాగడం లేదు. రెండు నెలల క్రితం స్థానిక ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ రైల్వే బ్రిడ్జి పనులపై రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం నిధులు 36లక్షల రూపాయలను తీసుకువచ్చి రాత్రికి రాత్రే రహదారి నిర్మాణం చేపట్టారు. మార్చి నెలాఖరుకు ఒకవైపు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు సైతం తెలిపారు. అప్పటి నుంచి ఓవర్‌ బ్రిడ్జి పనులు సాగడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రిడ్జి సమీపంలో పూర్తి స్థాయిలో భూసేకరణ, విద్యుత్‌ లైన్‌ల తొలగింపు వంటివి పూర్తి కాలేదు.

ఫ కిలో మీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు

రైళ్ల రాకపోకలు పెరుగుతుండటంతో ఎప్పుడు గేటు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గేటు పడ్డ సమయంలో కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఆప్రాంతంలో కనీసం ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు కూడా చేపట్టక పోవడంతో ఇరువైపుల వచ్చే వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యి గంటల తరబడి వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. రెండు వైపులా రైల్వే వంతెననిర్మాణంతో పాటు, రోడ్డు కిరువైపులా భూమి సేకరణతో పాటు, సర్వీసుల రోడ్ల నిర్మాణాలుచేపట్టాల్సి ఉంది. ఈ పనులు రైల్వే వంతెన నిర్మాణం ఇప్పటికి ఫిల్లర్ల దశలోనే ఉండి, రెండు చోట్ల మాత్రమే స్లాబ్‌ పనులు నడుస్తున్నాయి. ఈ పనులు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గేటు పడ్డ సమయంలో వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ట్రాఫిక్‌ పోలీసులు లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 01:09 AM