Local Body Election: పైసలు పాయే.. పదవీ రాకపాయే..
ABN , Publish Date - Dec 17 , 2025 | 07:06 AM
సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకొని మరికొందరు భూములు ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో దారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచి ఓడిన వారు తలలు పట్టుకుంటున్నారు.
బెల్లంపల్లి, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): మొదటి, రెండో విడత ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. ఎన్నికల్లో ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల మోజు తమను దెబ్బతీసిందని లక్షల రూపాయలు అప్పుల పాలు చేసిందని ఓటమి పాలైన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. పైసలు పంచినా ఓటర్లు తమకు మద్దతు ఇవ్వక మరొకరిని ఆదరించి వెన్నుపోటు పొడిచినట్లు ఓటమిపాలైన వారు ఆవేదన చెందుతున్నారు. సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకొని మరికొందరు భూములు ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో దారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచి ఓడిన వారు తలలు పట్టుకుంటున్నారు.
గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు...
ఆయా గ్రామాల్లో సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు పది లక్షల నుంచి ఏకంగా 50లక్షల రూపాయల వరకు పోటాపోటీగా ఖర్చు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో దాదాపు ఒక్కో అభ్యర్థి 30 నుంచి 40లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఎలక్షన్లో గెలువాలంటే ప్రత్యర్థికంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని అనుచరులు అభ్యర్థులకు సలహాలు ఇవ్వడంతో తగ్గేదేలే అంటూ ఖర్చు చేశారు.
పోటాపోటీగా ప్రతి రోజు మందు, విందులకు ఖర్చు చేయడంతో ఊహించిన దానికంటే ఎక్కువైంది. ప్రచార సమయంలో అభ్యర్థుల నుంచి ముందుగా డబ్బులు తీసుకున్న ఓటర్లు మీకే ఓటు వేస్తామని హామీ ఇచ్చి మరొకరు ఎక్కువ సొమ్ము ఇవ్వడంతో ఆవ్యక్తికే ఓటు వేసినట్లు చర్చించుకుంటున్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు, డబ్బుల ప్రభావం ఉంటుందని తెలిసిన కొందరు అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీ చేసినట్లు తెలుస్తుంది. కొందరు బరిలో ఉన్న అభ్యర్థులు ఏకంగా ఓటర్ల వద్దకు వెళ్లి చేతిలో పసుపు కుంకుమలుపెట్టి మరీ ఒట్టు వేయించుకున్నారు. అయినప్పటికీ ఫలితాలు తలకిందులయ్యాయి..
ఓటమి బాధ.. అప్పుల భయం...
మొదటి రెండో విడత ఎన్నికల్లో బరిలో ఉండి ఓడిపోయిన అభ్యర్థులు ఒక వైపు ఓటమిబాధతో మరో వైపు అప్పుల బాధతో ఉన్నారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థులను అన్న నువ్వే గెలుస్తున్నావ్ ఖర్చుకు వెనుకాడకు అంటూ అనుచరులు, గ్రామస్థులు తెలపడంతో ఇది నమ్మిన అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్తోమతకు మించి స్థిరాస్తులను తాకట్టు పెట్టి స్థాయికి మించి లక్షల్లో అప్పులు చేశారు. తీరా ఎన్నికలఫలితాలు బెడిసికొట్టడంతో ఇప్పుడు అభ్యర్థులకు పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది.
ఒక వైపు ఓటమి వెక్కిరిస్తుండగా మరో వైపు అప్పులు భయపెట్టిస్తున్నాయి. ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థులు తెచ్చిన అప్పులకు వడ్డీని ఎలా కట్టాలి. అసలు అప్పుతీర్చేది ఎన్నడో అని తలలు పట్టుకుంటున్నారు. అభ్యర్థులతో పాటు ఓటమిపాలైన కుటుంబాలను కూడా తీవ్ర వేదనకు గురి చేస్తుండడం గమనార్హం. రూ. లక్షల్లో అప్పులు చేసిన అభ్యర్థులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పే నాయకులనే చూశాంకాని ప్రస్తుతం నాయకులను మించి ఓటర్లు తయారయ్యారనే ఆసక్తికరమైన చర్చ గ్రామాల్లో జోరుగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి
మందు, మనీ.. తుది విడతలోనూ సాగిన ప్రలోభాల జాతర
భారీగా తగ్గిన పసిడి ధరలు.. కారణం ఇదీ