ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:27 AM
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది.

కరీంనగర్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. గురువారం 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ అనంతరం 71 మంది పోటీలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది పోటీ చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వంద నామినేషన్లు దాఖలు కాగా 32 నామినేషన్లను స్ర్కూటినిలో తిరస్కరించారు. పట్టభద్రుల స్థానంలో 13 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపాధ్యాయ స్థానానికి 17 నామినేషన్లు వచ్చాయి. వాటిలో ఒక నామినేషన్‌ను స్ర్కూటినిలో తిరస్కరించారు. ఒకరు నామినేషన్ ఉపసంహరించుకోగా 15 మంది పోటీలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చినమైల్ అంజిరెడ్డి, బహుజన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆలిండియా కిసాన్ జనతా పార్టీ అభ్యర్థిగా లంటు చంద్రశేఖర్, తెలంగాణ ప్రజా శక్తి పార్టీ అభ్యర్థిగా దొడ్ల వెంకటేశం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్‌సింగ్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా బక్క జడ్సన్, ధర్మసమాజ్‌పార్టీ అభ్యర్థిగా మంద జ్యోతి, తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ అభ్యర్థిగా బొల్లి సుభాష్, నేషనల్ నవ క్రాంతి పార్టీ అభ్యర్థిగా సిలివేరు ఇంద్రగౌడ్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ట్రస్మా రాష్ట్ర మాజీ చైర్మన్ యాదగిరి శేఖర్‌రావు, ముస్తాక్ అలీ, మరో 44 మంది ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, బహుజన సమాజ్‌పార్టీ అఽభ్యర్థిగా యాటకారి సాయన్న, దళిత బహుజన్ పార్టీ అభ్యర్థి గవ్వల లక్ష్మి, ఇండిపెండెంట్లుగా వై. అశోక్‌కుమార్, కంటె సాయన్న, కూర రఘోత్తంరెడ్డి, చాలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, ముత్తారం నర్సింహస్వామి, వంగ మహేందర్‌రెడ్డి, జర్నలిస్టు విక్రమ్‌రెడ్డి వేముల, సిలివేరు శ్రీకాంత్, ఎల్ సుహాసిని పోటీలో ఉన్నారు.
ప్రచారంపై దృష్టి
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిపట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన టి జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీపడ్డా పార్టీ రాష్ట్ర నాయకత్వం వి నరేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది. నరేందర్‌రెడ్డి అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్‌గా ఉత్తర తెలంగాణలో గుర్తింపులో ఉన్న వ్యక్తి కావడంతో బీజేపీ విద్యాసంస్థల అధినేతనే రంగంలోకి దింపింది. చినమైల్ అంజిరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీఆర్‌ఎస్ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఆ పార్టీ టికెట్ ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించిన ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రైవేట్ విద్యాసంస్థల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌కు బాధ్యతలు అప్పగించి ఇరుపార్టీలు పోటాపోటీగా పట్టభద్రుల మద్దతు కూడగట్టడానికి పోలింగ్‌కు వచ్చి తమకు అనుకూలంగా ఓటు వేయడానికి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టికెట్ ఆశించి రెబల్స్‌గా వేరే పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతూ ముమ్మర ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 3,55,159 ఓట్లు, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 28,088 ఓట్లు ఉన్నాయి. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 1,96,321 ఓట్లు, ఉపాధ్యాయ స్థానంలో 23,214 ఓట్లు ఉన్నాయి. పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆశావహులు నాలుగు నెలల ముందునుంచే ఓటర్లను పోటాపోటీగా నమోదు చేయించడంతో ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.