వేడెక్కుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Feb 22 , 2025 | 01:12 AM
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ రంగంలోకి దిగగా, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిని గెలిపించే బాధ్యత రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తమపై వేసుకొని నియోజకవర్గంలో రాజకీయవాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ రంగంలోకి దిగగా, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిని గెలిపించే బాధ్యత రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తమపై వేసుకొని నియోజకవర్గంలో రాజకీయవాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ రెండు స్థానాల పరిధి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నా నియోజకవర్గంలోని 45శాతం ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉండడంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మంత్రులు ఈ జిల్లాపైనే దృష్టిసారించి వివిధ వర్గాల ఓటర్లను కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్‌లోనే మకాం వేసి మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో సమావేశాలు నిర్వహించారు. పార్టీ నేతలను ఇప్పటికే రచించి పెట్టిన కార్యాచరణను అమలు చేసేందుకు క్షేత్రస్థాయికి పంపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఆశించి అది రాకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డిని సంజయ్‌కుమార్ కార్యక్షేత్రంలోకి దిగేలా చేశారు. మరో ఆశావహుడు రఘునాథ్‌రావును కూడా కేంద్రమంత్రి అంజిరెడ్డికి మద్దతుగా పనిచేసేలా చూసి అభ్యర్థి విజయానికి ఆటంకాలను తొలగిస్తూ వస్తున్నారు. రాష్ట్రమంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఇప్పటికే జిల్లాలో రెండు, మూడుసార్లు పర్యటించి ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్యనేతలందరినీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం చేసి బాధ్యతలను అప్పగించారు. వీరివురు జిల్లాలోని వివిధ వర్గాల ప్రముఖులను కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలువృత్తి సంఘాల నేతలతో చర్చించిన రాష్ట్రమంత్రులు ఐఎంఏ న్యాయవాదులు, ముస్లిం మైనార్టీ పెద్దల సమావేశాలను నిర్వహించారు. రెండు పార్టీలు కూడా పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను తీసుకొని 25 లేక 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జీ, ఇద్దరు సహాయకులను నియమించి వారిని కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఓటర్లందరి ఫోన్‌నెంబర్లను కూడా సేకరించిన పార్టీలు మెస్సెజీలు, వాట్సాప్ సందేశాల ద్వారా, వీడియోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వారందరికీ ఆన్‌లైన్‌లో డబ్బు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గ్రామకమిటీల ద్వారా ఓటర్లకు నేరుగా డబ్బు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కూడా చర్చించుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అభ్యర్థులను గెలిపించు కోవడం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా ఒకరిద్దరు అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఫ నేడు పట్టభద్రుల సింహగర్జన :
అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చివరి వరకు ప్రయత్నించారు. ఏఐసీసీ స్థాయిలో కూడా ఆయన పేరు పరిశీలనకు వచ్చినా చివరికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి వైపే అధిష్టానవర్గం మొగ్గుచూపించింది. ఆయనను అభ్యర్థిగా ఖరారు చేయడంతో ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసినా చివరికి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. హరికృష్ణకు మద్దతుగా పలు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, పట్టభద్రుల సింహగర్జన పేరిట కరీంనగర్‌లో శనివారం భారీ సమావేశం ఏర్పాటు చేశారు. 53 సంఘాల ప్రతినిధులు హాజరవుతారని, ఉమ్మడి జిల్లా పరిధిలోని పట్టభద్రులు దీనికి హాజరవుతారని ప్రచారం జరుగుతున్నది. ప్రొఫెసర్‌గానే కాకుండా వివిధ పోటీ పరీక్షల పుస్తకాల రచయితగా, పబ్లిషర్‌గా ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల్లో చిరపరిచితులుగా ఉన్నారు. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇరువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ప్రసన్నహరికృష్ణ బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఆయన ప్రధాన పోటీదారుగా మారారు. చివరి వరకు బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించడంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కూడా ప్రచారంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 15 మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలో నిలిచిన పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, టిపిటిఎఫ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన వై.అశోక్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎస్టీయు, జాక్టో మద్దతుతో టీచర్లను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.