Share News

భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:00 AM

భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం కలుగుతుందని విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. మానకొండూర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. భవిత కేంద్రం సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్రం నిర్వహణకు కావాల్సిన అవసరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.

భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం
నుస్తులాపూర్‌లో దివ్యాంగులతో మాట్లాడుతున్న కార్యదర్శి యోగితా రాణా

మానకొండూర్‌, పిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం కలుగుతుందని విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. మానకొండూర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. భవిత కేంద్రం సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్రం నిర్వహణకు కావాల్సిన అవసరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి, టీచింగ్‌ మెటీరియల్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రంలోని అన్ని భవిత కేంద్రాల్లో ఒకే విధమైన టైమ్‌టేబుల్‌, సిలబస్‌ను నిర్ణయించి అమలు చేస్తామని అన్నారు. భవిత కేంద్రంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక డైరినీ నిర్వహించాలన్నారు. అవసరమైన టీచింగ్‌, లర్నింగ్‌ మెటీరియల్‌ సమకూరుస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరుపున భవిత కేంద్రాల్లో రెయిలింగ్‌తో కూడిన ర్యాంపులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో పని చేస్తున్న సిబ్బంది వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన కేంద్రంలో స్పీచ్‌ థెరపిస్టును నియమించుకొని అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. కొందరు అధికారులు దివ్యాంగులైన పిల్లలను చిన్నచూపు చూస్తున్నారని తల్లిదండ్రులు తెలపగా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలీ తీసుకుంటామని యోగితా రాణా అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, డీఈవో జనార్దన్‌రావు, క్వాలిటీ కో ఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంఈవో మధుసుదనాచారి, ఎంపీవో కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

డీఈవోపై ఆగ్రహం

భవిత కేంద్రంలో కొనసాగుతున్న కార్యక్రమాలు, విద్యార్థులు ఎంత మంది, వాటి నిర్వహణ వివరాలను యోగితా రాణా జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావును అడిగారు. డీఈవో సరైన సమాదానం చెప్పక పోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేశారు. మండలంలో 111 మంది దివ్యాంగులు ఉండగా 16 మంది భవిత కేంద్రంలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థికి ఎస్కార్ట్‌ రవాణా భత్యాలు చెల్లించాలని ఆదేశించారు. దివ్యాంగులకు అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశించారు.

ఫ దివ్యాంగుల పునరావాస కేంద్రం పరిశీలన

తిమ్మాపూర్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని నుస్తులాపూర్‌లో నిర్వహిస్తున్న దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులతో ఆమె మాట్లాడారు. అనంతరం డైట్‌ను సందర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, డీఆర్డీవో శ్రీధర్‌, డీఈవో జనార్దన్‌రావు, సంస్థ ప్రిన్సిపాల్‌ శ్రీరాం మొండయ్య, జేడీ వెంకటనర్సమ్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:00 AM