వేసవి, వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:47 AM
వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

సిరిసిల్ల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేసవి వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడగాలులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్యాన్లు, కూలర్లు, ఎసీలు పని చేస్తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించాలని అన్నారు. మార్చి నుంచి జూలై వరకు ఆశా కార్యకర్తల నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వడగాలుల వల్ల వచ్చే ప్రమాదాలు, నివార ణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఫైర్‌ఆడిట్ నిర్వహించాలని, సమ్మర్‌కు సంబంధించి జిల్లా, మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ముఖ్యమైన ప్రాంతాల్లో చల్లని తాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. సాంస్కృతిక సారధి కళాకారులతో వడగాల్పులపై ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా అధికారులు ట్విట్టర్, ఫేస్‌బుక్; ఇన్ స్ట్రాగామ్, జిల్లా వెబ్‌సైట్‌లలో వడగాలుల నుంచి సంరక్షించేందుకు చేప ట్టే జాగ్రత్తల గురించి ప్రచారం చేయాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రా ల్లో టీచర్ల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి సమయాలను మార్చుకోవాలన్నారు. ఈ సమావే శంలో జిల్లా వైద్యాధికారి రజిత, డీపీవో శేషాద్రి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా పౌరసంబంధాల అధికారి వి శ్రీధర్, ఫైర్ అఫీసర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పోగ్రాం అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.