సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృదిఽ్ధకి చర్యలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:41 AM
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్‌రావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో స్వశక్తి సంఘాలకు అందించే చీరల ఆర్డర్లను 129 మ్యాక్స్ సోసైటీలకు అందించే ఆర్డర్ కాపీని అందించారు.
- 4.24 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు
- ఇందిరా మహిళ శక్తి చీరల ఉత్పత్తి
- టెస్కో జనరల్ మేనేజర్ అశోక్‌రావు
సిరిసిల్ల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్‌రావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో స్వశక్తి సంఘాలకు అందించే చీరల ఆర్డర్లను 129 మ్యాక్స్ సోసైటీలకు అందించే ఆర్డర్ కాపీని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళ శక్తి చీరల పథకంలో మొదటి విడతలో 4.24 కోట్ల మీటర్ల ఆర్డర్లను అందజేశామని వెల్లడించారు. ఈ చీరలను ఏప్రిల్ 30వ తేదీలోగా సిద్ధం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేములవాడ కేంద్రంగా రూ. 50 కోట్లతో యారన్ బ్యాంక్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్‌లో పోటీపడి స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లు తయారు చేసేలా యంత్రాలను అధునీకరించుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రూ. 500 కోట్ల బకాయిలు విడుదల చేసిందని అన్నారు. ఆధునిక, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేలా సిద్ధం కావాలన్నారు. ఇప్పటికే 65.67 లక్షల స్కూల్ యూనిఫాం ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. ఆర్డర్లు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వస్త్ర పారిశ్రామికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఎడీ సాగర్, టెస్కొ ఎడీ సందీప్‌జోషి పాల్గొన్నారు.
- సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి భరోసా
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేత కుటుంబాలకు మళ్లీ ఇందిరా మహిళ శక్తి చీరలు భరోసాను ఇవ్వనున్నాయి. 129 మ్యాక్స్ సొసైటీలకు టెస్కొ ఆర్డర్లు అందించడంతో నేత కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని స్వశక్తి సంఘాల్లోని సభ్యులకు రెండేసి చీరలు ఇవ్వడం ద్వారా నేత కార్మికులకు భరోసా కల్పించడానికి పూనుకుంది. ఇందిరా మహిళ శక్తి చీరల పథకంలో స్వశక్తి సంఘాలకు అందించే చీరల ఆర్డర్లు రావడంతో మళ్లీ సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు జవసత్వాలు వచ్చినట్లేనని భావిస్తున్నారు. సిరిసిల్లలో 30,352 మరమగ్గాలు ఉండగా 200 వరకు వార్ఫిన్, సైజింగ్, డైయింగ్ యూనిట్లు వున్నాయి. వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 20 వేల కార్మిక కుటుంబాలు ఆఽధారపడి జీవిస్తున్నారు. వీరికి చీరల ఆర్డర్లతో నిత్యం ఉపాధి దొరుకుతుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో స్వశక్తి పొదుపు సంఘాల్లో 63 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరికి రెండు చీరల చొప్పున 1.30 కోట్ల చీరలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో పాటు చీరల డిజైన్లను కూడా పరిశీలించి ఆమోదం తెలిపారు. కోటి 30 లక్షల చీరలకు రూ. 650 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వేశారు. ఇందులో భాగంగా చీరల ఉత్పత్తిని సిరిసిల్ల మరమ గ్గాలపైనే చేపట్టే దిశగా మ్యాక్స్ సొసైటీలకు మొదటి విడతలో ఇందిర మహిళ శక్తి చీరల్లో ఒకే రంగులో యూనిఫాంకు సంబంధించి 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను సిరిసిల్లలోని 129 మ్యాక్స్ సొసైటీలకు అందించారు. మొదటి దశలో రూ. 325 కోట్లతో 65 లక్షల చీరలు ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో 9 మీటర్లు (గోచీ) చీరలు, ఇతర మహిళలు ఉపయోగించే బ్లౌజ్‌తో కలిపి 6.30 మీటర్ల చీరలకు సంబంధించిన ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ఇచ్చారు. స్వశక్తి సంఘాల మహిళలకు అందించే చీరలను ఏప్రిల్ 30వ తేది వరకు ఉత్పత్తి పూర్తి చేసి అందించనున్నారు. స్వశక్తి సంఘాలకు అందించే చీరలను జరీ అంచులతో గ్రే క్లాత్ తయారు చేసి ఒకే రకం ప్రింటింగ్ చేయనున్నారు.