ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య
ABN , Publish Date - Mar 04 , 2025 | 01:36 AM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం విరబూసింది.
- మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం
- రెండో స్థానంలో నిలిచిన పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి
- పట్టభద్రుల స్థానంలో కొనసాగుతున్న ఉత్కంఠ
- పూర్తికాని చెల్లని ఓట్ల విభజన
- నేటి మధ్యాహ్నం వరకు ట్రెండ్స్ వెల్లడయ్యే అవకాశం
కరీంనగర్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం విరబూసింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బీజేపీ మాత్రమే ఈ స్థానంలో అభ్యర్థిని పోటీలో నిలుపగా మిగతా పార్టీలు దూరంగా ఉన్నాయి. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు పీఆర్టీయూ బలపరిచిన వంగ మహేందర్‌రెడ్డి గట్టి పోటీనిచ్చారు. నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 25,041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి 9 గంటలకు ముగిసింది. నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 24,968 మంది మరో 73 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలైన 25,041 ఓట్లు పోల్‌కాగా 897 ఓట్లు చెల్లకుండా పోయాయి. 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా అభ్యర్థి గెలుపొందడానికి 12,081 కోటా ఓట్లుగా గుర్తించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోటా ఓటుకు మించి ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయనను మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందినట్లుగా ప్రకటించారు. మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా ఆయన సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి 7182 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మరో అభ్యర్థి వై అశోక్‌కుమార్ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించగా అంచనాలను తారుమారు చేస్తూ కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లలోనే 5,777 ఆధిక్యంతో గెలుపొంది సంచలనం సృష్టించారు.
ఫ ఫలించిన వ్యూహం
బీజేపీ అధిష్ఠానం ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి అనుకున్న ఫలితం సాధించింది. మిగతావారికంటే ముందుగా జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య బరిలోకి దింపింది. ఆయన విజయం కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఘన విజయం సాధించారు.
ఫ కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. పట్టభద్రుల ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను, ఉపాధ్యాయ ఓట్లను లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లను వేర్వేరు చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లలో అధికంగా చెల్లని ఓట్లు కనిపించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. పట్టభద్రుల స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2,50,106 ఓట్లు పోలయ్యాయి. వీటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ రాత్రి వరకూ పూర్తికాలేదు. చెల్లిన, చెల్లని ఓట్ల వేరు చేసే ప్రక్రియ పూర్తిచేసి 25 ఓట్లకు ఒక బెండల్‌ను కట్టి, ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. 25 చొప్పు ఓట్ల కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశముంది. ఆ తర్వాత నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావచ్చని అంచనావేస్తున్నారు. చెల్లని ఓట్లతో ఫలితాలు తారుమారయ్యే అవకాశముంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యఓట్లతో గెలుపు కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెల్లని ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయో, ఎవరికి లాభం చేస్తాయో చెప్పలేని స్థితిలో అందరిలో టెన్షన్ మొదలైంది.