అంగరంగ వైభవంగా మహా శివరాత్రి జాతర..
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:47 AM
వేములవాడలో ఈనెల 25వ తేది నుంచి 27వ వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, గత సంవత్సరం మహా శివరాత్రి జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగుతామని రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి అన్నారు.
వేములవాడ కల్చరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వేములవాడలో ఈనెల 25వ తేది నుంచి 27వ వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, గత సంవత్సరం మహా శివరాత్రి జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగుతామని రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయ పరిసరాల్లో నిర్వహించే కోడె క్యూలైన్, ఉచిత టిఫిన్, భోజనం, లడ్డూ కౌంటర్, సులభ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా, చలువ పందిళ్ల ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈనెల 25,26,27వ తేదిల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో రానున్నారని తెలిపారు. సుమారు నాలుగు లక్షల మంది వరకు భక్తులు రానున్నారని అన్నారు. రాజన్న ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని అన్నారు. గతంలో జరిగిన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలని సూచించారు. భక్తులకు అన్నిరకాల సౌకర్యాలను అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకునే సమయంలో క్యూలైన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహా శివరాత్రిని వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆయన వెంట ఈఈ రాజేష్, డీఈ రఘునందర్, ఏఈవో శ్రావణ్ పర్యవేక్షకులు వరి నర్సయ్య, సంజీవరావు తదితరులు ఉన్నారు.