ఓటరుగా గర్విద్దాం...
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:42 AM
సామాన్యుడి చేతిలోని వజ్రాయుధం ఓటు హక్కు.. తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారానే లభించింది. ఓటరుగా దేశ రాజకీయ వ్యవస్థనే మార్చే అవకాశం ఉన్నందుకు గర్వించాలి. ఓటుహక్కు నమోదు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

- 4,76,435.. ఇదీ జిల్లా ఓటర్ల లెక్క..
- పురుషులు 2,29,852 మంది, మహిళలు 2,47,046 మంది
- జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
- ఓటరు కార్డుతో ఎన్నో ఉపయోగాలు
- ఓటు హక్కు నమోదుకు విస్తృత ప్రచారం
- నేడు జాతీయ ఓటరు దినోత్సవం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సామాన్యుడి చేతిలోని వజ్రాయుధం ఓటు హక్కు.. తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారానే లభించింది. ఓటరుగా దేశ రాజకీయ వ్యవస్థనే మార్చే అవకాశం ఉన్నందుకు గర్వించాలి. ఓటుహక్కు నమోదు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2001 నుంచి ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటరు దినోత్సవాన్ని శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఎన్నికలు వస్తే రాజకీయ నేతల పరుగులు..
ఎన్నికలు వచ్చాయంటే ఓటరు దేవోభవ అంటూ రాజకీయ నేతలు పరుగులు తీస్తారు. సామాన్యుడి నిర్ణయాలతో రాజకీయాలు, దేశ భవిష్యత్‌లోనూ మార్పులు వస్తాయి. ఓటుకు రాజకీయ నేతల భవిష్యత్త్ చూపుడు వేలుకు పెట్టే సిరా చుక్కతో తారుమారవుతుంది. ఓటర్లే నిర్ణేతలుగా ఉంటారు. మనిషికి ఒక వజ్రాయుధంగా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు ఓటు హక్కు. ఓటుహక్కు పొందడానికి ఎన్నికల కమిషన్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. దేశంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు అర్హులుగా కమిషన్ ఆధునిక సాంకేతిక మార్గాల ద్వారా కూడా ఇందుకోసం ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఆధార్ లింకేజీని కూడా ఓటరు గుర్తింపునకు చేశారు. కలర్ గుర్తింపు కార్డులు కూడా కమిషన్ అందిస్తోంది.
జిల్లాలో 4,76,435 మంది ఓటర్లు
జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో 4,76,435 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,29,352 మంది, మహిళలు 2,47,046 మంది ఉన్నారు. 37 మంది ట్రాన్స్‌జెండర్లు, 169 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో 17694 మంది మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. సిరిసిల్ల సెగ్మెంట్‌లో 2,48,334 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,20,498 మంది, మహిళలు 1,27,829 మంది ఉన్నారు. 7 మంది ట్రాన్స్‌జెండర్లు, 106 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 7331 మంది అధికంగా ఉన్నారు. వేములవాడ సెగ్మెంట్‌లో 2,28,101 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,08,854 మంది, మహిళలు 1,19,217 మంది ఉన్నారు. 30 మంది ట్రాన్స్‌జెండర్లు, 63 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. మహిళలు 10,363 మంది అధికంగా ఉన్నారు.
జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యం ఇదీ..
భారత రాజ్యాంగం 15వ భాగంలో 324వ అధికరణం ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను ప్రస్తావించింది. భారత ఎన్నికల సంఘం జనవరి 25, 1950లో ఏర్పడింది. అందుకే 2011 నుంచి జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు పార్లమెంట్ ఉభయ సభలకు రాష్ట్ర శాసనసభలకు, విధాన పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించడం ప్రధాన విధులు. ఈ సంఘం ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికులు కూడా నిర్వహిస్తుంది. సంఘానికి ప్రస్తుతం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారు. ఈ కమిషనర్లను కేంద్ర మంత్రి మండలి సూచనలు అనుసరించి రాష్ట్రపతి నియమిస్తారు.
రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు ఒక్కటే గుర్తింపుకార్డు..
దేశంలో రాష్ట్రపతి నుంచి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడి వరకు, అత్యున్నత అధికారి నుంచి అటెండర్ వరకు, ధనిక, పేద తేడా లేకుండా అందరికి ఒకే విధమైన గుర్తింపు కార్డు ఓటరు కార్డు మాత్రమే. భారత ఎన్నికల సంఘం జారీ చేసే గుర్తింపు కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
సామాజిక బాధ్యతగా గుర్తించాలి..
- డాక్టర్ చింతోజు భాస్కర్, లోక్ అదాలత్ సభ్యుడు సిరిసిల్ల
సామాజిక బాధ్యతగా ఓటుహక్కు పొందడం, ఓటు వేయడాన్ని గుర్తించాలి. ఓటుహక్కు నమోదు కోసం విద్యావంతులు ప్రజల్లో అవగాహన పెంచడానికి కృషి చేయాలి. ఓటు హక్కు వేయడం కోసం నిర్బంధపు చట్టం తేవాలి.
ఓటు వేయడం మన బాధ్యత
- బుస్స అఖిల, సాప్ట్‌వేర్ ఇంజనీర్, సిరిసిల్ల
ఓటు వేయడం మన బాధ్యతగా గుర్తించాలి. ఓటుకు ఎంతో విలువ ఉంది. మన భవిష్యత్త్‌ను తీర్చిదిద్దే ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే వీలు ఉంటుంది. ఓటు హక్కును ముఖ్యంగా యువత వినియోగించుకోవాలి. దేశ భవిష్యత్త్ కోసం ఓటు వేయాలి.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
- రాజూరి మాధవి, సిరిసిల్ల
ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యంలో మార్పులు సాధ్యమవుతాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసువాలి. ఓటరు నమోదు కోసం ఎన్నికల కమిషన్ ఎన్నో విధాలుగా అవకాశాలు కల్పిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు కావచ్చు.
ఫ ఓటు విలువ తెలుసుకోవాలి..
- మీసరగండ్ల సాయి సుహాస్, పెద్దలింగాపూర్
ఓటు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓటుహక్కును అందరు వినియోగించుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. విద్యావంతులు, యువకులు ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండటం దురదృష్టకరం. ఓటును అమ్ముకోకుండా, సమర్థవంతులైన వ్యక్తులకు వేయడం ద్వారానే ఉత్తమ సమాజం నిర్మితం అవుతుంది. అర్హులందరు ఓటుహక్కును నమోదు చేసుకోవాలి.
ప్రభుత్వాలను ప్రశ్నించాలంటే ఓటు వేయాలి
- చిట్యాల అఖిల, కేసన్నపల్లె
ప్రభుత్వాలను ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు ద్వారానే సమానత్వం వస్తుంది. సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయకపోతే అసమర్థులు రాజ్యపాలన చేస్తారు. ఓటుహక్కును వినియోగించుకొని వారిపై చర్యలు తీసుకుంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుంది. పట్ణణాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.
ఓటే ఆయుధం..
- ఏలిగేటి నిఖిత, రుద్రంగి
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం. ప్రజల తలరాతలను మార్చే వజ్రాయుధం. సమాజంలో మార్పు రావాలంటే ఆవినీతిరహిత పాలన అందించే వారినే పాలకులుగా ఎన్నుకోవాలి. దీంతో గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది
ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు..
- చెలుకల శ్రీకాంత్, రుద్రంగి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా నచ్చిన మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు భారత రాజ్యంగంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కును కల్పించింది. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలి.