అంగన్‌వాడీల్లో కొలువుల పండుగ
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:17 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంగన్‌వాడీల్లో కొలువుల పండుగ మొదలు కానుంది.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంగన్‌వాడీల్లో కొలువుల పండుగ మొదలు కానుంది. ఇప్పటికే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు(ఆయాలు) ఖాళీల భర్తీ చేయనున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించడంతో నిరుద్యోగ మహిళల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గర్భిణీ, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు పూర్వ విద్య కేంద్రాలుగా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని కేంద్రాలను ప్రీస్కూళ్లుగా మార్చారు. అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ విద్య అందించే దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాల్లో 43 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా 18,645 మందికి పౌష్టికాహారం, ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు బాలామృతంతో పాటు 16 కోడిగుడ్లు, హోం రేషన్ అందిస్తున్నారు. 15,804 మంది చిన్నారులకు ఒక్కపూట సంపూర్ణభోజనం, గుడ్డు, పాలు కుర్‌కురే వంటి స్నాక్స్‌లు అందిస్తున్నారు. జిల్లాలో సమర్థవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
43 టీచర్లు, 174 ఆయా పోస్టులు ఖాళీ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 20 మినీ కేంద్రాలు ఉండగా, వాటిని పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో రిటైర్‌మెంట్ ప్రక్రియను అమల్లోకి తేవడంతో జిల్లాలో 122 పోస్టులు ఖాళీ అయ్యాయి. గతంలో ఉన్న ఖాళీలతో కలుపుకొని జిల్లాలో 217 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. భర్తీకి కసరత్తు మొదలుపెట్టినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో మార్చి 8 తరువాత నోటిఫికేషన్ జారీ కానుంది. జిల్లాలో 43 టీచర్లు, 174 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరిసిల్ల ప్రాజెక్ట్ పరిధిలో 362 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 30 టీచర్ పోస్టులు, 105 ఆయా పోస్టులు, వేములవాడ ప్రాజెక్ట్ పరిధిలో 225 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 13 టీచర్ పోస్టులు, 69 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెద్ద మొత్తంలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులకు ఊరటగా మారనుంది.
ఈసారి ఇంటర్ అర్హత..
అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో టీచర్లకు పదో తరగతి, ఆయాలకు 7వ తరగతి విద్యార్హతగా ఉంది. ప్రీస్కూల్‌గా మార్చి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పూర్వ విద్యను అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈసారి టీచర్లు, ఆయాలకు ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించారు. టీచర్లు, ఆయాలకు వయస్సు 18 నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా సంక్షేమ శాఖ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఖాళీల నివేదికలను ప్రభుత్వానికి పంపించారు. మార్గదర్శకాలు రావడంతో కలెక్టర్ నోటిఫికేషన్‌ను ఇవ్వనున్నారు.