Karimnagar: ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కరువు
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:48 PM
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ బైపాస్‌రోడ్‌లోని తీగల వంతెన చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం భారీ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

నిలిచిపోయిన వాహనాలు
- తీగలవంతెన చౌరస్తాలో భారీగా నిలిచిపోయిన వాహనాలు
- వారానికి రెండు సార్లు స్తంభిస్తున్న ట్రాఫిక్...
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ బైపాస్‌రోడ్‌లోని తీగల వంతెన చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం భారీ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చౌరస్తాకు నలువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో వాహనదారులతోపాటు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారానికి రెండు సార్లు ఇదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతున్నదని హౌసింగ్‌బోర్డు కాలనీవాసులు, ఆటోనగర్ వాసులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం తీగలవంతెన వద్ద నాలుగు రోడ్లపై అరకిలోమీటరు దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 నిమిషాలపాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. తీగలవంతెన వద్ద తరచుగా ట్రాఫిక్ స్తంభిస్తున్నా పోలీసులు నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తీగల వంతెన చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవటంతోపాటు పోలీసులు కనిపించడం లేదు. ఈ చౌరస్తా నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. వాటిలో భారీ వాహనాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగు వైపుల నుంచి ఒకేసారి వాహనాలు వెళ్లే క్రమంలో స్తంభించి ఇబ్బంది తలెత్తుతున్నది. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదా ట్రాఫిక్ పోలీసులకు విధులను కేటాయిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సాధారణంగా వారాంతపు సెలవు దినాల్లో నగరవాసులు తీగలవంతెనను చూసేందుకు ద్విచక్రవాహనాలు, కార్లలో సాయంత్రం వేళ భారీగా తరలివెళుతుంటారు. ఇదే సమయంలో మానకొండూర్ నుంచి కరీంనగర్‌కు, గోదావరిఖనివైపు, హైదరాబాద్ నుంచి గోదావరిఖని వైపు, గోదావరిఖని నుంచి హైదరాబాద్, వరంగల్ వైపునకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు భారీ వాహనాలు రాత్రి వరకు నగరంలోకి అనుమతించకపోవడంతో కొందరు ఇక్కడే రోడ్డు పక్కన పార్క్ చేసుకోవడం కూడా వాహనాలు రాకపోకలకు ఆటంకంగా మారుతున్నది. కొన్ని ప్రైవేట్ బస్సులు ఇదే చౌరస్తా వద్ద నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. పోలీసు అధికారులు స్పందించి తీగలవంతెన చౌరస్తాలో వాహనాల క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని నగరవాసులు, వాహనదారులు కోరుతున్నారు.