karimnagar : గరంగరంగా ఎమ్మెల్సీ రాజకీయాలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:20 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం
- రంగంలోకి బీఆర్‌ఎస్
- ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణను ప్రకటించే అవకాశం
- అధిష్ఠానం ప్రకటన కోసం పలువురి ఎదురు చూపు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీలో ఉండేది లేనిది ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. అధికార కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా కొందరు ప్రచారం చేసుకుంటూ ఓటర్ల నమోదు కార్యక్రమంలో నాలుగు నెలలపాటు నిమగ్నమై ఉండి క్షేత్రస్థాయిలో పలు సమావేశాలు నిర్వహిస్తే బీఆర్‌ఎస్‌లో ఆ ఊసే లేకుండా పోయింది. ఆ పార్టీ అధిష్ఠానం ఎలాంటి సంకేతాలు, ప్రకటనలు లేక పోవడంతో పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపడం లేదనే అందరూ భావిస్తూ వచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని, పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటే తాను స్వతంత్రుడిగా పోటీ చేస్తానని ప్రకటించి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఫ అగ్రనేతలతో హరికృష్ణ భేటి
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్‌లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కాంగ్రెస్ అధికారికంగా తన అభ్యర్థిని ప్రకటించగానే బీఆర్‌ఎస్ అధిష్ఠానం వేగంగా పావులు కదపడం ప్రారభించింది. కాంగ్రెస్ టికెట్‌ను అల్ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఆశిస్తూ వచ్చారు. నరేందర్‌రెడ్డికే కాంగ్రెస్ అవకాశం కల్పించడంతో బీఆర్‌ఎస్ దృష్టి ప్రసన్న హరికృష్ణవైపు మళ్లింది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిస్తే బాగుంటుందని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు, మాజీ మంత్రి హరీష్‌రావుతో భేటీ అయ్యారు. తనకు అవకాశం కల్పిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తానని ప్రతిపాదించారని, అదే ఆలోచనతో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు కూడా ఆయనకు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్, హరీష్‌రావు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి ఆదివారం తీసుకెళ్లారని, సోమవారం ఉదయానికి కేసీఆర్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలిసింది. కాంగ్రెస్‌నుంచి నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి అభ్యర్థులుగా బరిలో ఉంటున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన హరికృష్ణను పోటీలో నిలిపితే తమకు కలిసి వచ్చే అవకాశమున్నదని బీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో, విద్యావంతులతో ఉన్న సంబంధాలు ఇటు బీఆర్‌ఎస్ బలం, బలగం తోడై ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని ఆలోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అదే సమయానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి కూడా అధికారికంగా ఖరారవుతారని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.
బరిలోనే ఉంటానంటున్న రవీందర్‌సింగ్
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెన్నంటి ఉంటూ వస్తున్న కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ తనను అభ్యర్థిగా నిలుపుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. నాలుగు నెలలుగా ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అనూహ్యంగా రెండురోజుల్లో మారిన రాజకీయాలు ఆయనకు మింగుడుపడడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణకు బీఆర్‌ఎస్ అవకాశం కల్పిస్తే తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయడం విరమించుకోబోనని తేల్చిచెప్పారు. బరిలోనే ఉండి తీరుతానని స్పష్టం చేశారు. ఉద్యమకారుడిగానే కాకుండా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా తాను గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టికెట్ అడిగానని, అప్పుడు కూడా పార్టీ మొండి చేయి చూపించిందన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే తాను స్వతంత్రుడిగా పోటీలో ఉంటానని ఆయన చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌కే చెందిన ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. బీఆర్‌ఎస్ నుంచి పోటీచేసే విషయంలో ఎలాంటి సంకేతాలు వెలువడక పోవడంతో స్వతంత్రుడిగా పోటీలో ఉంటున్నట్లుగా ఆయన ఇదివరకే ప్రకటించారు. బీఆర్‌ఎస్ నుంచే పోటీచేయాలని ఐఎంఎ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు కూడా కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.