Share News

karimnagar : ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:41 AM

కరీంనగర్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కింపునకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు.

karimnagar :  ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

- ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

- 800 మందితో ఓట్ల లెక్కింపు

- రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం

కరీంనగర్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కింపునకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియం ఆవరణలోని ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. పట్టభద్రుల నియోజకవర్గంలో 2,50,328 మంది ఓటర్లు, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,968 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో 56 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది పోటీచేశారు. నియోజకవర్గ పరిధిలోని 773 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను మూడు షిఫ్టుల్లో 35 టేబుళ్లపై పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓట్లను వేర్వేరుగా లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు 800 మంది ఉద్యోగులను నియమించి వారికి శిక్షణ ఇచ్చారు. ప్రతి టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్‌, సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు విధులు నిర్వహించనున్నారు. ప్రాధాన్య క్రమంలో చేపడుతున్న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి రెండు, మూడురోజులు పట్టే అవకాశమున్నందున మూడు షిఫ్టుల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

రెండో ప్రాధాన్య ఓట్లే కీలకం

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వి నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి సి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా సర్దార్‌ రవీందర్‌సింగ్‌సహా 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలిప్రాధాన్యత ఓటుతో అభ్యర్థి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లలో 50 శాతానికంటే ఒక ఓటు అధికంగా రావలసి ఉంటుంది. ఏకపక్షంగా పోలింగ్‌ జరగక పోవడం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి ఓట్లు ఎక్కువగా పోల్‌కావడంతో తొలి ప్రాధాన్య ఓటుతో ఎవరు గెలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. దీనితో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి ఎక్కువగా పోలయ్యాయి.. ఎవరు.. ఎవరి తలరాతలు మార్చనున్నారు అన్నది అంతుపట్టకుండా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 56 మంది పోటీలో ఉన్నా ఎలిమినేషన్‌ పద్దతిలో ఓట్ల లెక్కింపు చేపట్టే క్రమంలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినుంచి మొదలు పెట్టి ఎలిమినేట్‌ చేస్తూ అతడి బ్యాలెట్‌లో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారికి వాటిని కలుపుతూ వెళ్తారు. దీంతో సోమవారం కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించినా రాత్రి వరకు బ్యాలెట్లను వేరు చేసి కట్టలు కట్టడం పూర్తవుతుందని, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడితే ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడేందుకు మరో రెండురోజులైనా పడుతుందని భావిస్తున్నారు.

అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది అభ్యర్థులు మాత్రమే పోటీపడుతుండటమే కాకుండా 24,968 ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉండడంతో సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఆదివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు.

Updated Date - Mar 03 , 2025 | 12:41 AM