Share News

Karimnagar: కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధిని చాటుకోవాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 10:39 PM

కరీంనగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కులగణనపై శాసనసభలో బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తామని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ బలహీన వర్గాలపైన చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు మద్దతివ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

 Karimnagar:  కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధిని చాటుకోవాలి

- బండి సంజయ్‌కు చేతనైతే దేశవ్యాప్తంగా కులగణన కోసం కృషి చేయాలి

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కులగణనపై శాసనసభలో బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తామని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ బలహీన వర్గాలపైన చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు మద్దతివ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో మాట్లాడుతూ తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నారని, 46 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టబద్ధత కల్పించనున్నట్లు తెలిపారు. దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చెప్పే లెక్కలు తప్పని, బలహీన వర్గాలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కులగణనలో తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి కోటి 15 లక్షల కుటుంబాలకు సర్వే చేయగా కోటి 12 లక్షల కుటుంబాలు తమ సమాచారాన్ని స్వచ్ఛందంగా ఇచ్చాయన్నారు. సర్వేకు స్పందించని దాదాపు 3.1 శాతంలో కొంత మంది తమ సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్త చేశారని, వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సర్వేను సమాచారం ఇవ్వని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలు దీనిని రీ సర్వే అంటున్నారనీ, ఇది రీ సర్వే కాదు.. ఎవరైతే సర్వేలో మిస్సయ్యారో, సర్వేలో సమాచారం ఇవ్వలేదో వారికి మరో అవకాశం ఇస్తున్నామన్నారు. మార్చి మొదటి వారంలో కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి, తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 42 శాతం స్థానిక సంస్థల్లో, విద్యా, ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే కార్యాచరణ తీసుకున్నామన్నారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో చేపట్టిన సమగ్రకుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదని, ఆ సర్వే నివేదికను కేబినెట్‌లో, శాసన సభలో పెట్టలేదని విమర్శించారు. కులగణనపై బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ పార్టీ తరపున విజ్ఞప్తి చేయాలన్నారు. బీజేపీకి వారికి జనాభాకి అనుగుణంగా బీసీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని, బండి సంజయ్‌కి చేతనైతే కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభ అభిప్రాయంతో పాటు తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం వల్ల కేంద్రం నుంచి నిధులు రావని, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి పద్మకర్‌రెడ్డి, ఎండీ తాజ్‌, వైద్యుల అంజన్‌కుమార్‌, సిరాజ్‌ హుస్సేన్‌, పులి ఆంజనేయులుగౌడ్‌, గడ్డం విలాస్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ముత్యం శంకర్‌, బుచ్చిరెడ్డి, మాచర్ల ప్రసాద్‌, సరిల్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 10:39 PM