Share News

karimnagar : అందరి చూపు.. ఉమ్మడి జిల్లా వైపు..

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:53 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా కీలకంగా మారింది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధికి సంబంధించిన ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఓట్లలో 45.12శాతం ఓట్లు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి.

karimnagar :  అందరి చూపు.. ఉమ్మడి జిల్లా వైపు..

- పట్టభద్రుల ఎన్నికల్లో 45 శాతం ఓట్లు ఇక్కడివే

- ప్రత్యేక దృష్టి పెట్టిన అభ్యర్థులు

- ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా కీలకంగా మారింది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధికి సంబంధించిన ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఓట్లలో 45.12శాతం ఓట్లు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థుల దృష్టి ఈ జిల్లాపైనే కేంద్రీకృతమవుతున్నది. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మకాం వేసి తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు.

ఫ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ పరిధిలోకి 13 జిల్లాలు పూర్తిగా, 2 జిల్లాలు పాక్షికంగా వస్తాయి. ఆరు పార్లమెంట్‌ స్థానాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉన్నది. నియోజకవర్గ పరిధిలో 2,26,765 మంది పురుషులు, 1,28,392 మహిళలు, ఇద్దరు థర్డ్‌జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 3,55,159 ఓట్లు ఉన్నాయి. వీటిలో 1,60,260 ఓట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఈ ఓట్లు నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓట్లలో 45.12శాతం కావడం గమనార్హం. కరీంనగర్‌ జిల్లాలో 71,545 ఓట్లు, పెద్దపల్లి జిల్లాలో 31,037 ఓట్లు, జగిత్యాల జిల్లాలో 35,281 ఓట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22,397 ఓట్లు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా ఓట్లనే పరిగణలోకి తీసుకున్నా 20 శాతం ఓట్లు ఇక్కడే ఉన్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పట్టభద్రులు ఓటర్లుగా ఉన్న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతుండడంతో ఈ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.

ఫ పట్టు సాధించేందుకు..

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనుండడంతో ఇక్కడి ఫలితాలు ఆ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల నుంచి బీఆర్‌ఎస్‌ పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్‌, బీజేపీ బరిలో ఉన్నాయి. ఇక్కడ గెలుపు సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల్లో తమకు ఉన్న పట్టేమిటో చాటుకోవడానికి ఈ ఫలితం ఊతంగా నిలుస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో 42 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా కాంగ్రెస్‌కు చెందిన వారు 23 మంది, బీజేపీకి చెందిన వారు ఏడుగురు, బీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిధిలో ఆరుగురు ఎంపీలు ఉండగా నలుగురు బీజేపీకి చెందిన వారు, ఇద్దరు కాంగ్రెస్‌ వారున్నారు. బీఆర్‌ఎస్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్‌, బీజేపీ ఈ పట్టభద్రుల స్థానాన్ని గెలుచుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే ఆ రాజకీయ పక్షాలు పట్టభద్రుల ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపైనే ప్రత్యేక దృష్టిసారించాయి.

ఫ పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు

రెండు రాజకీయ పక్షాలు నియోజకవర్గ స్థాయిలో పార్టీశ్రేణులు, నాయకులు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 25, 50 ఓట్లకు ఒక్కరిని ఇన్‌చార్జిగా నియమించి ఆ ఓటరుతో సత్సంబంధాలు పెట్టుకొని రోజూ మాట్లాడుతూ పోలింగ్‌ రోజు వారిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొని వచ్చి ఓటు వేసేలా చూడాలని బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఓటర్లను నేరుగా కలిసేందుకు వీలులేని పరిస్థితి ఉండడంతో పార్టీ కేడర్‌పైనే ప్రధాన బాధ్యతను ఉంచుతున్నారని చెబుతున్నారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు, ప్రత్యర్థి పార్టీవారు తమ తమ సమావేశాల్లో మాట్లాడుతున్న అంశాలు ఏమిటి, వారు పన్నుతున్న వ్యూహాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఫ ప్రచారంలో కీలకమవుతున్న బీసీ, స్థానిక నినాదాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక, బీసీ నినాదాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓట్లే 45శాతం కావడంతో స్థానిక నినాదం బలంగా వస్తున్నది. అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారనే కారణంతోనే ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని ప్రాంతాల నుంచి నామినేషన్‌ వేసిన అభ్యర్థులందరూ తాము స్థానికులమని, తమకు అవకాశం కల్పించాలని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీసీ నినాదం బలంగానే వినవస్తున్నది. ఒకవైపు బీసీ కుల గణన జరుగుతుండడం, మరోవైపు రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు పెంచాలని రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే తమ రాజకీయ అవకాశాలను కాలరాస్తున్నారని బీసీ వర్గాలు పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్నాయి. బీసీ వాదం బలంగా ఉండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు అగ్రవర్ణాలకు చెందినవారని, బీసీ కులానికి చెందిన తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. స్థానిక, బీసీ నినాదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Updated Date - Feb 17 , 2025 | 12:53 AM