jagitiala : ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో రాయితీ
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:12 AM
జగిత్యాల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఈ యేడాది మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రక్రియ పూర్తయితే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది.

-మార్చి 31లోగా చెల్లిస్తే 25 శాతం తగ్గింపు
-జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 38,820
-మున్సిపాలిటీల్లో 27,361, పంచాయతీల్లో 11,459 దరఖాస్తులు
జగిత్యాల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఈ యేడాది మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రక్రియ పూర్తయితే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయితే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో అనుకున్న సమయానికి పరిశీలన పూర్తవుతుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా గతంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కలిపి 38,820 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 27,361 దరఖాస్తులు రాగా 1,249 దరఖాస్తులు ఆమోదం పొందాయి. 392 తిరస్కరణకు గురికాగా, 95 దరఖాస్తులకు ఫీజు చెల్లించారు. ఇందులో ధర్మపురి మున్సిపాలిటీలో 1,011, జగిత్యాలలో 8,771, కోరుట్లలో 9,143, మెట్‌పల్లిలో 6,538, రాయికల్‌లో 1,898 దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాలలో 285 దరఖాస్తులు ఆమోదం పొందగా, 186 దరఖాస్తులు తిరస్కరణ, 42 దరఖాస్తులకు ఫీజుల చెల్లింపు జరిగింది. కోరుట్లలో 298 దరఖాస్తులు ఆమోదం పొందగా, 167 దరఖాస్తులు తిరస్కరణ, 7 దరఖాస్తులకు ఫీజుల చెల్లింపు జరిగింది. మెట్‌పల్లిలో 152 దరఖాస్తులు ఆమోదం పొందగా, 2 దరఖాస్తులు తిరస్కరణ, 46 దరఖాస్తులకు ఫీజుల చెల్లింపు జరిగింది. రాయికల్‌లో 513 దరఖాస్తులు ఆమోదం పొందగా, 37 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. రాయికల్‌లో ఫీజుల చెల్లింపు ప్రారంభం కాలేదు. ధర్మపురిలో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే ఆమోదం పొందింది. తిరస్కరించడం గానీ, ఫీజుల చెల్లింపు గాని జరగలేదు.
ఫగ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు ఇలా..
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 11,459 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 595 దరఖాస్తులు ఆమోదం పొందగా, 1,177 దరఖాస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు. ఆమోదం పొందిన వాటిల్లో కేవలం 4 దరఖాస్తులకు మాత్రమే ఫీజు చెల్లించారు. జిల్లాలో అత్యధికంగా జగిత్యాల మండలంలో 3,055 దరఖాస్తులు, మల్యాలలో 2,800 దరఖాస్తులు, అత్యల్పంగా బుగ్గారం మండలంలో 5, బీర్‌పూర్‌లో 11, సారంగపూర్‌లో 23 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు ఆమోదం పొంది ఫీజుల చెల్లింపు జరిగిన వాటిల్లో జగిత్యాల రూరల్ మండలంలో 2 దరఖాస్తులు, మల్యాల మండలంలో రెండు దరఖాస్తులున్నాయి.
ఫఒక్కో దశ దాటితేనే..
తొలుత సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆపై మొబైల్ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, గ్రామం, మున్సిపాలిటీల్లో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన బృందం పరిశీలన జరపాల్సి ఉంటుంది. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంది. అదే సమయంలో భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో లేవని ధ్రువీకరించాల్సి ఉంటుంది. మూడు దశల్లో జరగాల్సి ఉన్నందున చాలా సమయం పట్టే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ఫఊరటనిచ్చేలా రాయితీ
కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ దరఖాస్తుదారులకు ఊరటనిస్తోంది. ఒక ప్లాట్‌కు సంబంధించి రోడ్డు, పైప్‌లైన్, ఇతర సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసినందుకు ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు విధిస్తుంటారు. వీటితో పాటు గ్రీన్‌ల్యాండ్‌కు 10 శాతం స్థలాన్ని ఇవ్వనందుకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం విలువను లెక్కించి దానిపై 14 శాతం చార్జీ విధిస్తారు. ఈ రెండు చెల్లిస్తేనే యజమానికి స్థలం రెగ్యులరైజ్ అవుతుంది. మొత్తంగా రాయితీతో దరకాస్తుదారులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయాన అదనపు సిబ్బందిని కేటాయించాలన్న సూచనలు సైతం దరఖాస్తుదారుల నుంచి వస్తున్నాయి.
ఫరూ.కోట్లలో ఆదాయం
2011లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ప్రాథమిక రుసుము వసూలు చేశారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. అదే తరహాలో మిగితా మొత్తం చెల్లించేలా చేసి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ రాయితీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతం అవుతుందని సంబందిత వర్గాలు అంటున్నాయి. అయితే మార్చి 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఇవ్వడంతో ఆ లోగా పూర్తి స్థాయి దరఖాస్తులు పరిశీలించడం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు చొరవ చూపిస్తేనే ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.