jagitial : పరీక్షలకు వేళాయె
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:46 AM
జగిత్యాల, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పరీక్షల సీజన్ వచ్చేసింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను పరీక్షల ఫీవర్ వెంటాడుతోంది. మంచి మార్కుల సాధనకు విద్యార్థులు..

- మార్చి, ఏప్రిల్ నెలల్లో వివిధ తరగతుల పబ్లిక్ పరీక్షలు
- పదోతరగతి నుంచి డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
- ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిళ్లతో విద్యార్థుల్లో టెన్షన్
జగిత్యాల, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పరీక్షల సీజన్ వచ్చేసింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను పరీక్షల ఫీవర్ వెంటాడుతోంది. మంచి మార్కుల సాధనకు విద్యార్థులు.. వారికి కావాల్సిన వసతుల కల్పనలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. పదో తరగతి ఇంటర్‌మీడియట్, ఓపెన్‌స్కూల్, డిగ్రీ, వివిధ పీజీ ప్రవేశపరీక్షలు మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం జిల్లాలో దాదాపు 70 వేల మంది పైబడి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలన్న ఒత్తిడిలో విద్యార్థులు ఉండగా... ఇన్నాళ్లు చదివింది ఒకెత్తు ...ఈ పరీక్షలు ఒకెత్తూ...తమ పిల్లలు మంచి మార్కులు సాధించి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్న ఆకాంక్ష తల్లిదండ్రుల్లో ఉంది. మరోవైపు విద్యార్థుల్లో అధిక మందికి మొబైల్ ఫోన్ వ్యసనంగా మారింది. పరీక్షల సమయంలో సోషల్ మీడియా కబుర్లతో కాలక్షేపం చేస్తే ఆ ప్రభావం పరీక్షలపై పడుతుందన్న సైకాలజిస్టుల హెచ్చరికలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటికి దూరం ఉంటూ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థుల విషయంలో మరింత ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మరోవైపు పలువురు ప్రైవేటు యాజయాన్యాలు విద్యార్థులపై చదువు ఒత్తిడి పెంచుతున్నాయి. చదువులో ప్రతిభ చూపేవారిని మరింత రుద్దుతున్నారు. తమ కళాశాలకు పేరు రావాలన్న లక్ష్యంతో సామార్థ్యాలకు మించి ఒత్తిడి పెంచుతున్నారు. చదువులో ప్రతిభ చూపేవారిపై మరింత ఒత్తిడి తెస్తున్నారు. ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్న వైద్యుల హెచ్చరికలు అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి.
- పరీక్షల సీజన్...
మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు పూర్తి చేయడానికి అనుగుణంగా ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరపడానికి అనుగుణంగా ఎస్సెస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు సుమారు 40 వేల మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు సుమారు 30 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఇంటర్, పదోతరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీరితో పాటు డిగ్రీ, పీజీ, ఓపెన్ స్కూల్, పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సైతం ప్రిపరేషన్‌పై దృష్టి సారించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే మేలు..
- డాక్టర్ సాకేత్‌రెడ్డి, మానసిక వైద్యనిపుణుడు, జగిత్యాల
చదివిన సిలబస్ పరీక్షల్లో రాయగల సామర్థ్యం రావాలంటే మానసిక ప్రశాంతత, ఆరోగ్యంపై శ్రద్ధవహిస్తూ సులభంగా జీర్ణమయ్యే ఆహారం, తగినంత నిద్ర, నీరు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పరీక్షలపై ఉన్న భయాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలి. చదువు మధ్యలో స్వల్ప విరామం తీసుకోవాలి. నీరు, కొబ్బరినీరు, మజ్జిగ తాగడం మంచింది. పరీక్షకు వెళ్లే ముందు, పరీక్ష హాలులో మౌనంగా ఉండాలి. అవసరమైన పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా ఉండేలా చూస్తూ వారితో స్నేహపూర్వకంగా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మెలగాలి.
చదువుతో పాటు రాయడం ప్రాక్టీస్ చేయాలి
- తులసి ఆగమయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జగిత్యాల జిల్లా
పరీక్షల ప్రాక్టీస్‌లో భాగంగా చదవడంతో పాటు విద్యార్థి రాయడం చేయాలి. పబ్లిక్ పరీక్ష ముందు రోజు వరకు రాస్తున్న సాధారణ పరీక్షలను పబ్లిక్ పరీక్షగా భావిస్తూ ప్రాక్టిస్ చేయాలి. పరీక్షలో జవాబు పత్రాన్ని రాస్తున్నప్పుడు ఎటువంటి గాబరా పడకుండా ప్రశ్నాపత్రాన్ని నిశితంగా చదవాలి. ఆపై బాగా వచ్చే ప్రశ్నలను ముందుగా రాయాలి. మర్చిపోకూడదు. సమయం మిగిలితే ఛాయిస్‌తో కలిపి సమాధానాలను రాయాలి.