అన్నింటా ‘ఆమె’..
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:00 AM
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ‘మహిళ’ ఇప్పుడు అన్ని రంగాల్లో తానై విజేతగా నిలుస్తోంది. నాడు ఆంక్షల సంకెళ్లతో కనిపించిన మహిళలు నేడు చైతన్యవంతులై చట్టసభల నుంచి ఆకాశం వైపు దూసుకుపోతున్నారు.
- అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
- అయినా ఆగని వేధింపులు, అకృత్యాలు
- బాధితులకు అండగా సఖి కేంద్రం
- జిల్లాలో సఖి కేంద్రానికి 1222 కేసులు
- ఇప్పటి వరకు 913 పరిష్కారం
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
(ఆంధ్రజోతి, సిరిసిల్ల)
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ‘మహిళ’ ఇప్పుడు అన్ని రంగాల్లో తానై విజేతగా నిలుస్తోంది. నాడు ఆంక్షల సంకెళ్లతో కనిపించిన మహిళలు నేడు చైతన్యవంతులై చట్టసభల నుంచి ఆకాశం వైపు దూసుకుపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా మంది మహిళలు హక్కుల కోసం పోరాడుతూనే స్వశక్తిగా ఎదుగుతున్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినా వాటికి ఎదురొడ్డి నిలుస్తూ ఉన్నత స్థాయి బాటలో పరుగులు తీస్తున్నారు. అన్నింట్లో తాము ముందున్నామని చాటి చెబుతున్నారు. ఆర్థికంగా బలపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. చైతన్యవంతంగా అడుగులు వేస్తున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలు, బాలలికలపై మృగాళ్ల అకృత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందుకు తీసిపోదు అన్నట్లుగానే చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు, కళాశాల విద్యార్థుల నుంచి ఉద్యోగినుల వరకు వేధింపులను ఎదుర్కొంటున్నారు. వీరికి సఖి అండగా, బాసటగా, భరోసాగా నిలుస్తోంది. వివిధ రూపాల్లో హింస, వేధింపులకు గురవుతున్న వారిని అక్కున చేర్చుకొని ఓదారుస్తున్నారు. తప్పిపోయిన వారిని సొంతింటికి చేరుస్తున్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ పరిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 2019 అక్టోబరులో ఏర్పడిన సఖి కేంద్రం మహిళలకు వివిధ సేవలను అందిస్తోంది. అనేక కేసులకు పరిష్కారం చూపుతోంది.
ఫ సఖి కేంద్రంలో 1222 కేసులు నమోదు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సఖి కేంద్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 1222 కేసులు నమోదయ్యాయి. ఇందులో డోమెస్టిక్ వయోలెన్స్‌కు సంబంధించి 724 కేసులు, లైంగిక వేదింపులకు సంబంధించి 16 కేసులు, కిడ్నాపింగ్ 2, పోక్సో కేసులు 96, చైల్డ్ మ్యారేజ్ 7, మిస్సింగ్ 67, సైబర్, ప్రేమ చీటింగ్ 43, వరకట్న వేధింపులు 58, వరకట్న హత్యలు 2 కేసులను నమోదు చేశారు. ఇందులో 309 కేసులు కొనసాగుతుండగా, 913 కేసులను పరిష్కరించారు. డొమెస్టిక్ వయోలెన్స్‌లో 473 కేసులు, లైంగిక వేధింపుల్లో 11, పోక్సోలో 96, మిస్సింగ్ 67, సైబర్, లవ్ చీటింగ్ 39, వరకట్న వేధింపులు 34 కేసులను పరిష్కరించారు. పోక్సో కేసుల్లో రూ.73.45 లక్షల పరిహారాన్ని బాధితులకు అందించారు. సఖి కేంద్రంతో పాటు పోలీసులు భరోసా, షీటీమ్ వంటి కేంద్రాలు జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇబ్బంది పడుతూ మహిళలు కేంద్రానికి వస్తే మహిళలు న్యాయం అందించడంతో పాటు తాత్కాలిక వసతి, పోలీసుల ద్వారా రక్షణ, రెస్క్యూ వాహన సదుపాయం, పోలీస్ బాలల సంక్షేమ సమితి, చైల్డ్ లైన్, బాలరక్ష భవన్, ఇతర విభాగాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు అండగా నిలుస్తున్నా మృగాళ్ల దురాగతాలు ఆగడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యాచార కేసులు 2022లో 38, 2023లో 21, గత సంవత్సరం 20 కేసులు నమోదయ్యాయి. 2023లో పోక్సో కేసులు 38 నమోదు కాగా, గత సంవత్సరం 47 నమోదు చేశారు. పోలీసులు షీటీమ్ ద్వారా 2023లో 18 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి 24 మందిపై కేసులు నమోదు చేశారు. గత సంవత్సరం 127 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి 44 కేసులు నమోదయ్యాయి. మహిళలకు రక్షణగా ఆపరేషన్ జ్వాల పేరుతో 2600 మంది విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. బస్సులో భరోసాలో 147 ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ అక్క పేరుతో పోలీస్ కానిస్టేబుల్‌లతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఫ అందుబాటులో టోల్ ఫ్రీ నంబరు..
జిల్లాలో సఖి కేంద్రం, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. గృహ హింస పనిచేసే చోట, విద్యా సంస్థల్లో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడానికి, బాధిత మహిళలకు అండగా టోల్ ఫ్రీ నంబర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. మహిళ హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098లు 24 గంటలు పనిచేస్తాయి.
ఫ చట్టాలు ఉన్నా... ఆగని హింస
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా హింస మాత్రం ఆగడం లేదు. మహిళల కోసం రోజురోజుకు చట్టాల్లో మార్పులు తీసుకరావడం, కొత్త చట్టాలు చేస్తున్నా గ్రామీణ మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు ఆగడంలేదు. మహిళలకు చట్టాలపై అవగాహన లేకపోవడమే ఒక కారణంగా చెప్పవచ్చు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలపై హింస మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఒకవైపు ఇంట్లో, మరోవైపు బయట ప్రపంచంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో యువతులపై దాడులు చేస్తున్న సంఘటనలు కలవరపెడుతుంటే, ఇంటి లోపల కూడా స్త్రీలు హింసకు బలవుతున్నారు. అంతేకాకుండా కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, పొలాలు, కార్ఖానాల్లోనూ లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.
ఫ మహిళల రక్షణ చట్టాలు..
హింసకు వ్యతిరేకంగా దశాబ్దాల కాలంగా మహిళలు సాగిస్తున్న ఉద్యమాల ఫలితంగా 1970 తరువాత స్త్రీల సమస్యలపై చర్చకు వచ్చాయి. ఇందులో మహిళలు సాధించిన కుటుంబ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం 2005 ముఖ్యమైంది. అంతే కాకుండా నిర్భయలాంటి అనేక చట్టాలను సాధించారు. మహిళలకు రక్షణగా వచ్చిన ఎంతో ముఖ్యమైన చట్టం 498(ఎ)ను రూపొందించారు. ఆత్మాభిమానాన్ని కించపరచడం, స్ర్తీల మనోభావాలను దెబ్బతీయడం వంటి చర్యలకు పాల్పడితే జైలుశిక్ష, జరిమానాలు వేస్తారు. మహిళలకు ఉన్న పరిమితుల దృష్ట్యా హింసకు గురవుతున్న ఆమె తరపు బంధువులు, సంక్షేమ సంఘాలు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఐపీసీ 312 సెక్షన్ ప్రకారం గర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలిసి గర్భస్రావం చేయించిన బాధ్యులకు మూడేళ్లు జైలుశిక్ష, జరిమానా. మహిళ మరణిస్తే 10 ఏళ్ల జైలుశిక్ష ఉంది. 509 సెక్షన్ ప్రకారం విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగినుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినా, కించపరిచినా, సైగలు చేసినా సాధారణ జైలుశిక్ష, జరిమానా ఉంది. సెక్షన్ 354 ప్రకారం అత్యాచారం చేయాలనే ఉద్ధేశ్యంతో ఎవరైనా మహిళపై దాడిచేస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. సెక్షన్ 366 ద్వారా ఎవరైనా మహిళను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవాలనో, చేయించాలనో, వివాహేతర సంబంధం పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రలోభాలకు గురిచేస్తే 10 ఏళ్ల జైలుశిక్ష ఉంది. 18 ఏళ్లలోపు యువతితో(ఆమె అనుమతితో) లైంగిక సంబంధం పెట్టుకున్నా అత్యాచారంగానే పరిగణించి శిక్షిస్తారు.
ఫ మహిళ దినోత్సవం నేపథ్యం
చారిత్రాత్మకతను సంతరించుకున్న మహిళల దినోత్సవం నేపథ్యం పరిశీలిస్తే పోరాటాల చరిత్ర కనిపిస్తుంది. శాంతి కోసం, ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం జరిగిన పోరాటంలో ప్రపంచమంతటా శ్రామిక మహిళలు అంతర్జాతీయంగా ఐక్యత దినోత్సవంగా మార్చి 8 ముందుకు వచ్చింది. 1908 మార్చి 8న న్యూయార్క్‌లో రిడ్చర్ స్క్వేర్ వద్ద వేలాది మంది కుట్టు పని చేసే మహిళా కార్మికులు పనిగంటల కోసం, ఓటు హక్కు కోసం మహిళలు ప్రదర్శనలు జరిపారు. ఈ ప్రదర్శన మహిళల్లో ఉత్సాహం నింపింది. రెండు సంవత్సరాల తరువాత 1910 డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌లో అంతర్జాతీయ సోషలిస్టు మహిళల సదస్సు జరిగింది. అందులో క్లారా జెట్కిన్ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినంగా, మహిళల హక్కుల దీక్షా దినంగా జరపాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రపంచంలో పలు దేశాల్లో మహిళా దినోత్సవాని గుర్తించినా.. భారతదేశంలో మాత్రం 1975, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించారు.