Share News

అభివృద్ధి కొనసాగాలనే బీజేపీలోకి..

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:58 PM

అభివృద్ధి కొనసాగాలనే బీజేపీలో చేరుతున్నానని మేయర్‌ సునీల్‌రావు అన్నారు. బీజేపీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ షరతులు లేకుండా బీజేపీలో చేరుతున్నానని, సామాన్య కార్యకర్తగా తనకు మంత్రి సంజయ్‌ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు.

అభివృద్ధి కొనసాగాలనే బీజేపీలోకి..

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి కొనసాగాలనే బీజేపీలో చేరుతున్నానని మేయర్‌ సునీల్‌రావు అన్నారు. బీజేపీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ షరతులు లేకుండా బీజేపీలో చేరుతున్నానని, సామాన్య కార్యకర్తగా తనకు మంత్రి సంజయ్‌ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. బండి సంజయ్‌ నాయకత్వంలోనే కరీంనగర్‌ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. తనకు మేయర్‌ పదవి రావడానికి ప్రధాన కారణం వినోద్‌కుమారేనని అన్నారు. తాను మేయర్‌ కాకుండా ఎమ్మెల్యే గంగుల కమలాకరేనని పలు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అన్ని అవమానాలను దిగమింగుకుని బీఆర్‌ఎస్‌లో ఐదేళ్లు పని చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో జరిగిన ప్రతి స్కామ్‌ వెనుక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హస్తముందన్నారు. అవినీతికి కేరాఫ్‌ గంగుల కమలాకర్‌ అని విమర్శించారు. తన జోలికి వస్తే ఎమ్మెల్యే అవినీతి, అక్రమాల బండరాన్ని బయటపెడతానని హెచ్చరించారు. కరీంనగర్‌ అభివృద్ధికి బండి సంజయ్‌ నిధులు తీసుకువస్తే ఆ సొమ్మును ఎమ్మెల్యే దండుకున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే కమలాకర్‌ టెండర్లు, కమీషన్లు తీసుకున్నారని, ఆయన బినామీలతోనే అన్ని రకాల కాంట్రాక్టు పనులు చేయిస్తూ దోచుకున్నారన్నారు. స్మార్ట్‌సిటీ నిధులు బండి సంజయ్‌ తెచ్చారని వాస్తవాలు చెబితే గంగులకు ఎందుకు కోపమని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు, ఎంపి, మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, బండి సంజయ్‌ ఏనాడూ పైసలు అడుగలేదని తెలిపారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మందు తాగించి, డిన్నర్‌ పార్టీలు పెట్టి బతిమిలాడడంతోనే పలువురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, త్వరలోనే వారంతా బీజేపీలో చేరుతారన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:58 PM