Share News

స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:32 AM

జిల్లా కేంద్రంలోని స్కానింగ్‌, ఫెర్టిలిటీ సెంటర్లను రాష్ట్రస్థాయి ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ఇన్‌చార్జి డాక్టర్‌ సూర్యశ్రీరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గురువారం తనిఖీ చేసింది.

స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ
రికార్డులను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, స్పెషల్‌ టీమ్‌ బృందం

సుభాష్‌నగర్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని స్కానింగ్‌, ఫెర్టిలిటీ సెంటర్లను రాష్ట్రస్థాయి ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ఇన్‌చార్జి డాక్టర్‌ సూర్యశ్రీరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గురువారం తనిఖీ చేసింది. ఈ బృందంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత సభ్యురాలిగా ఉన్నారు. ఈ సందర్భంగా స్కానింగ్‌ సెంటర్ల్‌కు వచ్చిన పేషంట్లకు సంబందించిన వివరాలు, పీసీపీఎన్‌డీటీ జిల్లా అప్రొప్రియేట్‌ అథారిటీ కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, అందులో పనిచేస్తున్న డాక్టర్ల అర్హతకు సంబందించిన సర్టిఫికెట్లను పరిశీలించారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం-1994, రూల్స్‌ 1996 అమలు తీరును పరిశీలించారు. గర్భస్థ శిశువుగా ఉన్నపుడు స్త్రీ, పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయాలు తెలుపుతూ ప్రతి స్కానింగ్‌ సెంటర్‌లో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుజాత మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్లలో రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. రికార్డులు సరిగా నిర్వహించాలన్నారు. తనిఖీల్లో పీవోడీటీటీ డాక్టర్‌ ఉమశ్రీ, పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ సనజవేరియా, సఖి కన్సల్టెంట్‌ డి లక్ష్మి, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ కె రమేశ్‌, డెమో రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:32 AM