కేంద్ర బడ్జెట్‌పై ఆశలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:49 AM
ఉత్తర తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ జిల్లా రైల్వే సౌకర్యాల విస్తరణలో వెనుకబడి ఉంది. రాష్ట్రంలో ద్వితీయ నగరంగా రూపుదాల్చుతున్న జిల్లా కేంద్రం ఇప్పటికే విద్య, వైద్య రంగాలలో అగ్రగామిగా నిలుస్తుండగా ఐటీ, టూరిజం రంగాలకు అత్యధిక అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా మొత్తంగా అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే రైల్వే శాఖ కొత్త రైలు మార్గాల నిర్మాణం చేపట్టడం, పాత మార్గాల పనులు త్వరితగతిన పూర్తి చేయడం, లైన్ల డబ్లింగ్, ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టాల్సిన అవసరమున్నది.
- కొత్తపల్లి-మనోహరాబాద్‌కు మోక్షం కలిగేనా..!
- కరీంనగర్-హసన్‌పర్తి పనులు ప్రారంభానికి నోచుకునేనా..!
- ఆదాయ పన్ను పరిధి పెంపుపై ఆశలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉత్తర తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ జిల్లా రైల్వే సౌకర్యాల విస్తరణలో వెనుకబడి ఉంది. రాష్ట్రంలో ద్వితీయ నగరంగా రూపుదాల్చుతున్న జిల్లా కేంద్రం ఇప్పటికే విద్య, వైద్య రంగాలలో అగ్రగామిగా నిలుస్తుండగా ఐటీ, టూరిజం రంగాలకు అత్యధిక అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా మొత్తంగా అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే రైల్వే శాఖ కొత్త రైలు మార్గాల నిర్మాణం చేపట్టడం, పాత మార్గాల పనులు త్వరితగతిన పూర్తి చేయడం, లైన్ల డబ్లింగ్, ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టాల్సిన అవసరమున్నది. సంవత్సరాలుగా సాగుతున్న రైల్వే లైన్ల విస్తరణ పనులు వేగవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో జిల్లా రైల్వే ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తారని జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న బండి సంజయ్‌కుమార్ రైల్వే విస్తరణ పనులపై పలుమార్లు రైల్వేశాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు ఉంచిన నేపథ్యంలో ఫిబ్రవరి 1న శనివారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో జిల్లాకు ప్రాధాన్యత లభిస్తుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
ఫ కొత్తపల్లి-మనోహరాబాద్‌ను ఈ బడ్జెట్‌తో పూర్తిచేయండి :
కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నేరుగా రైలు సౌకర్యం కల్పించేందుకు 2016 జూలై 21న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొత్తపల్లి-మనోహరాబాద్ 151.34 కి.మీ. రైల్వే లైను నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూనే వస్తున్నది. ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం 76.135 కి.మీ. పనులు మాత్రమే పూర్తిచేశారు. 75 కి.మీ. పనులు ఇంకా పూర్తిచేయాల్సి ఉన్నది. గత బడ్జెట్‌లో 350 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. గడిచిన సెప్టెంబర్ నాటికి సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు 30 కి.మీ. రైలు మార్గం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 38.6 కి.మీ. రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించడమే కాకుండా ఏడాదిలోగా ఈ లైన్ నిర్మాణ పనులు పూర్తిచేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఫ కరీంనగర్-హసన్‌పర్తి మార్గంపై ఆశలు
కరీంనగర్ నుంచి వరంగల్‌కు నేరుగా రైలు రవాణా సౌకర్యాన్ని కల్పించే కరీంనగర్-హసన్‌పర్తి మార్గం ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది. ఫైనల్ లోకేషన్ సర్వే మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేశారు. ఈ రైలు మార్గానికి 1300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసి రైల్వే బోర్డు అనుమతి కోసం పంపించగా ఆ ఫైలుకు మోక్షం లభించడం లేదు. ఈ సంవత్సరం రైల్వే బోర్డు అనుమతి ఇప్పించి, బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.
ఫ కరీంనగర్-తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యేనా...
సేతు బంధన్ పథకం కింద రూ.154 కోట్ల అంచనా బడ్జెట్‌తో చేపట్టిన కరీంనగర్-తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఓవర్ బ్రిడ్జి నిర్మించే రోడ్డును తవ్వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు వచ్చినపుడు గేట్లు మూసివేయడంతో ఇరువైపులా కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయి అరగంటపాటు వేచిచూడాల్సి వస్తున్నది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతోపాటు 46 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ నుంచి సంవత్సరం పొడవునా కాకినాడ పోర్టుకు గ్రానైట్ రవాణా జరుగుతుంది. ఇక్కడి నుంచి చైనాకు, ఇతర దేశాలకు సముద్రమార్గంలో గ్రానైట్ తరలిస్తున్నారు. కరీంనగర్ -కొత్తపల్లి రైల్వే స్టేషన్లలో ఎక్కువ లైన్లను నిర్మించి గ్రానైట్, ఎరువులు, ఇతర వస్తువుల రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు, వ్యాపారులు కోరుకుంటున్నారు.
ఫ కొత్త రైళ్లపై ఆశలు :
కరీంనగర్-సికింద్రాబాద్, కరీంనగర్-విజయవాడ మధ్య ప్రస్తుతం ఉన్న పెద్దపల్లి మార్గం మీదుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ నడిపించాలని, విశాఖ-షిరిడీ మధ్య నడిచే సాయినగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పెద్దపల్లి-కరీంనగర్ మీదుగా మళ్లించాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంటలో తెలంగాణ, జీటీ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని పెంచాలి :
కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమల ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని, ఎలక్ర్టానిక్ పరికరాలు, ఇతర అత్యవసరాలపై ఇంపోర్టు డ్యూటీని తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు.