Share News

‘అభయ హస్తం’పై ఆశలు..

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:22 AM

అభయ హస్తం లబ్ధిదారులకు వారు చెల్లించిన వాటాధనానికి వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘అభయ హస్తం’పై ఆశలు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అభయ హస్తం లబ్ధిదారులకు వారు చెల్లించిన వాటాధనానికి వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి చివరి వరకు మహిళల ఖాతాల్లో జమ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే అభయ హస్తం లబ్ధిదారుల వివరాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా సేకరించారు. లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోయినా వారి నామినీలకు డబ్బులు చెల్లించే విధంగా వివరాలు కూడా సేకరించారు. దాదాపు తొమ్మిదేండ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60,881 మంది లబ్ధిదారులు తమ వాటాధనం కింద రూ.4.82 కోట్లు చెల్లించారు. 2009లో ప్రారంభమైన అభయహస్తం పథకాన్ని 2016లో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకంలో డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని 2022లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. రాజకీయ పరిణామాల క్రమంలో ప్రభుత్వం మారిపోయింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అభయ హస్తం లబ్ధిదారులు తాము చెల్లించిన వాటాధనమైనా ఇప్పించాలని కోరుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం ఫిబ్రవరి చివరిలోగా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినా మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

నీరుగారిన అభయ హస్తం లక్ష్యం..

ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ పురుడు పోసుకున్న మహిళా పొదుపు సంఘాలు బ్యాంక్‌ లింకేజీ, స్త్రీనిధి రుణాలతో వ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధిలో ముందుకు సాగుతున్నాయి. ఈక్రమంలోనే 2009లో అప్పటి ప్రభుత్వం పొదుపు సంఘాల్లోని మహిళలకు ఎల్‌ఐసీ అనుసంధానంతో అభయహస్తం పథకాన్ని అందించినా ఆచరణలో లక్ష్యం నీరుగారిపోయింది. అభయహస్తం పథకంలో చేరిన మహిళలకు ఎంతో ఉపయోగకరంగా కనిపించింది. కానీ ఆ తరువాత వచ్చిన తెలంగాణ స్వరాష్ట్రంలోనే ప్రభుత్వం పథకాన్ని నిలిపివేయడంతో మహిళలు నిరాశచెందారు. కనీసం ప్రీమియం చెల్లించిన లబ్ధిదారులకు తిరిగి డబ్బులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే చూపుతోంది. పథకం లేకపోయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లబ్ధిదారులకు కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. అభయ హస్తంపై 2022 మార్చిలో లబ్ధిదారులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు అభయ హస్తం వివరాలు ఇవ్వాలని కోరడంతో లబ్ధిదారుల పాలసీ వివరాలు బ్యాంక్‌ ఖాతాల వివరాలు ‘సెర్ఫ్‌’ సేకరించి ప్రభుత్వానికి పంపించింది. అభయ హస్తం డబ్బులు వస్తాయని భావించినా దాదాపు మూడేండ్లు గడిచినా ఇంతవరకు లబ్ధిదారులకు ప్రీమియం డబ్బులు గానీ, బకాయిలు గానీ అందించలేదు. మళ్లీ డబ్బులు అందించే పక్రియ తెరపైకి వచ్చింది.

తొమ్మిదేండ్లుగా నిలిచిన పింఛన్‌

అభయహస్తం ద్వారా అందాల్సిన పింఛన్‌, బీమా, ఉపకారవేతనాలు తొమ్మిదేండ్లుగా నిలిచిపోయాయి. ఒక వ్యక్తికి ఒకే పింఛన్‌ నిబంధనతో అభయ హస్తం లబ్ధిదారులు ఆసరా పింఛన్లు కూడా పొందలేకపోయారు. 2017లో అభయ హస్తంలో మార్పులు తీసుకవచ్చి కొత్త పథకాన్ని అందిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. వాటాధనం తిరిగి చెల్లిస్తామని చెప్పినా మళ్లీ పట్టించుకునే వారు కరువయ్యారు. 2009లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకానికి మంచి స్పందన లభించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పింఛన్లు కూడా వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60,881 మంది అభయ హస్తం లబ్ధిదారులు పథకంలో చేరి వాటాధనాన్ని చెల్లించారు. గత ఐదేండ్లుగా పింఛన్‌కు కూడా లబ్ధిదారులు నోచుకోవడం లేదు.

జిల్లాలో లబ్ధిదారుల వాటాధనం రూ.4.82 కోట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభయ హస్తం పథకంలో చేరినా 60,881 మంది సభ్యులు ప్రతి సంవత్సరం రూ.365 చొప్పున రూ.4.82 కోట్లు వాటాధనం కింద జమ చేశారు. సభ్యుల్లో 60 సంవత్సరాలు దాటిన వారు పింఛన్‌కు అర్హత పొందారు. 2016 సంవత్సరం వరకు పింఛన్‌ అర్హత పొందిన 3969మంది ఉన్నారు. పథకంలోని 60 సంవత్సరాల లబ్ధిదారులకు 2015 డిసెంబర్‌ వరకు పింఛన్‌, సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు సక్రమంగానే అందాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బకాయిలు 2017 జనవరిలో మాత్రమే పింఛన్‌ వచ్చింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసి వెబ్‌సైట్‌ను మూసివేసింది.

పింఛన్‌ బకాయిలు రూ.8 కోట్లు

అభయ హస్తం పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పొదుపు సంఘాల్లోని సభ్యులు పథకంలో చేరారు. పథకాన్ని ఎల్‌ఐసీ సంస్థతో అనుసంధానం చేశారు. పొదుపు సంఘాల్లోని నిరుపేద మహిళలు అర్హులుగా చేర్చి రోజుకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రూ.365 జమ చేయించారు. జమ చేసిన సభ్యుల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి రూ.500 చొప్పున పింఛన్‌ అందించే వారు సభ్యురాలికి బీమా సౌకర్యం కల్పించారు. సహజంగా మరణిస్తే రూ.30వేలు, ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం చెందినా రూ.75వేలు, పాక్షికంగా దివ్యాంగులు అయితే రూ.37,500 చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పింఛన్‌ రావాల్సిన వారికి బకాయిలు రూ.8 కోట్ల వరకు ఉన్నాయి. పింఛన్‌ బకాయిలతో పాటు ఇన్సూరెన్స్‌ కూడా అందలేదు. పథకాన్ని పూర్తిగా మూసివేయడంతో తిరిగి ఆ డబ్బులు చెల్లించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Updated Date - Jan 31 , 2025 | 01:22 AM