Share News

పోలీస్‌ కమిషనర్‌గా గౌస్‌ ఆలం

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:46 PM

కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌గా గౌస్‌ ఆలం నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీపీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీస్‌కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ ఎస్పీగా పనిచేస్తున్న గౌస్‌ ఆలంను కరీంనగర్‌ సీపీగా బదిలీ చేశారు. సీపీ అభిషేక్‌ మొహంతితోపాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను వెంటనే రిలీవ్‌ చేయాలని కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి 21న ఆదేశాలు జారీ చేసింది.

పోలీస్‌ కమిషనర్‌గా గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌గా గౌస్‌ ఆలం నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీపీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీస్‌కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ ఎస్పీగా పనిచేస్తున్న గౌస్‌ ఆలంను కరీంనగర్‌ సీపీగా బదిలీ చేశారు. సీపీ అభిషేక్‌ మొహంతితోపాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను వెంటనే రిలీవ్‌ చేయాలని కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి 21న ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మిగతా వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీవ్‌ చేయగా కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున అభిషేక్‌ మొహంతిని మాత్రం బదిలీ చేయకుండా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. ఎన్నికల కోడ్‌ ఉన్నందున సీపీ అభిషేక్‌ మొహంతి ఇప్పటి వరకు కొనసాగారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం సీపీ అభిషేక్‌ మొహంతితోపాటు చాలా మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫ 16 నెలల కాలంలో తనదైన ముద్ర వేసిన అభిషేక్‌ మొహంతి

కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌గా 16 నెలలకాలం అభిషేక్‌ మొహంతి పనిచేశారు. ఆయన ముక్కుసూటిగా వ్యవహరించారు. డీఐజీ పదోన్నతితోనే బదిలీపై వెళతారని అనుకున్నప్పటికీ అనూహ్యంగా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆయన బదిలీ అయ్యారు. జిల్లాలో ల్యాండ్‌ మాఫియా, చిట్‌ఫండ్స్‌పై బాధితులు వందల సంఖ్యలో సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దందాలపై ఉక్కుపాదం మోపేందుకు సీపీ అభిషేక్‌ మొహంతి ప్రత్యేకంగా డీజీపీ నుంచి అనుమతి తీసుకుని ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌(ఈఓడబ్ల్యు)ను ఏర్పాటు చేశారు. ప్రతి ఫిర్యాదును తనే స్వయంగా పరిశీలించి, విచారణ జరిపి నిందితులను గుర్తించి కటకటాల వెనక్కి పంపించారు. నిందితుల్లో అప్పటి అధికారపార్టీ నాయకులు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులుండడంతో ఒక్కసారిగా అక్రమార్కుల్లో అలజడి రేగింది. దీంతో 90 శాతం ఫిర్యాదులపై రాజీ కుదుర్చుకున్న అక్రమార్కులు కేసులు, అరెస్టుల నుంచి బయటపడగా బాధితులకు ఎలాంటి కేసులు లేకుండానే న్యాయం జరిగింది. దీంతో అక్రమ దందాలు, అక్రమార్కులపై పోలీస్‌ కమిషనర్‌ వ్యవహరించిన తీరుపై సామాన్యులు మొదలుకొని అందరు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఫ కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌గా అభిషేక్‌ మొహంతి 2023 అక్టోబరు 31న బాధ్యతలు చేపట్టి 16 నెలల కాలం పూర్తి అయింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయపార్టీలను సమానంగా చూస్తూ తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుని ఎమ్మెల్యేలపై కూడా ఎన్నికల కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించారు.

ఫ సీపీ గౌస్‌ ఆలం బయోడెటా

కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం బీహార్‌లోని గయాలో జన్మించారు. ఆయన ముంబై ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 2017 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన గౌస్‌ అలం శిక్షణలో పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించి బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ అవార్డు సాధించారు. ఐపీఎస్‌ శిక్షణ అనంతరం ఏటూరునాగారం ఏఎస్‌పీగా విధులు నిర్వహించారు. అనంతరం ఖమ్మం ఓఎస్డీగా పనిచేశారు. 2022లో ములుగు ఎస్పీగా పనిచేశారు. 2024 జనవరిలో ఆదిలాబాద్‌ ఎస్పీగా నియమితులయ్యారు. శుక్రవారం కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 11:46 PM