దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:46 AM
ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో మొత్తం 52,326 దరఖాస్తులు వచ్చాయి. కొత్త పథకాల ద్వారా ఎంపిక చేసిన పలువురు లబ్ధిదారులకు ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా చెక్కులను అందజేయనున్నారు.
యేడాది క్రితం దరఖాస్తుల స్వీకరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏడాది క్రితం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ, వార్డు సభల ద్వారా ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దశల వారీగా ఆయా పథకాలను అమలు చేస్తూ వస్తున్నది. మొదటి విడతలో ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 10,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, సొంత స్థలం గల లబ్ధిదారులనే ఎంపిక చేసి గ్రామసభ ఆమోదం కోసం పెట్టనున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,80,664 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,28,972 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల్లో 61,692 దరఖాస్తులు వచ్చాయి. సాగులో ఉన్న భూములకే ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించిన మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సాగు భూములను గుర్తించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం సర్వే నిర్వహించి అర్హులను గుర్తించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలను నిర్వహించారు. ఈ సభల్లో ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో పేర్లు లేవని అధికారులను నిలదీయడంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
21 నుంచి 23 తేదీల్లో వచ్చిన దరఖాస్తులు
రేషన్ కార్డులకు 25,693
ఇందిరమ్మ ఇళ్లకు 15,528
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 9,890
రైతుభరోసా కోసం 1215
మొత్తం 52,326 దరఖాస్తులు వచ్చాయి.
ఏడాది క్రితం ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షా 80 వేల దరఖాస్తులు రాగా, ఆ మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఇందిరమ్మ యాప్‌లో వివరాలు నమోదు చేశారు. రేషన్ కార్డుల కొసం గతంలో వచ్చిన 15,255 దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశారు. ఉపాధిహామీ పథకం ద్వారా 20 రోజులపాటు పనులు చేసిన కూలీలను గుర్తించారు. అందులో ఎలాంటి భూమి లేని వారికి ఏడాదికి రూ.12 వేలు ప్రభుత్వం ఇవ్వనున్నది. సర్వే అనంతరం ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో 80 వేల మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆత్మీయ భరోసాలో కూడా లబ్ధిదారుల జాబితా తగ్గింది. మూడు రోజులపాటు నిర్వహించిన గ్రామసభల్లో అర్హుల జాబితాలను ప్రకటించగా, పలువురు తమ పేర్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జాబితాలో తమ పేరు ఎందుకు లేదని గ్రామ, వార్డు సభల్లో ప్రజలు అధికారులు, సిబ్బందిని నిలదీశారు. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని ప్రభుత్వం పరిశీలిస్తుందా, లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నుంచి మొదటి విడతలో ఎంపికయ్యే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.