దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:40 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలకు గ్రామసభల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గ్రామసభలో ప్రదర్శించిన జాబితాల్లో అనర్హులకు చోటు కల్పించారని మండిపడ్డారు. నిరసనలు, నిలదీతల నడుమ సభలు కొనసాగగా అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలన్న సూచనతో ఈ సభలు దరఖాస్తుల స్వీకరణ సభలుగా మారాయి.

- గ్రామ, వార్డుసభల్లో నాలుగు పథకాలకు అధిక సంఖ్యలో ఆర్జీలు
- రేషన్ కార్డులో చేర్పులు, మార్పులకు సైతం...
- చివరి రోజూ గ్రామసభల వద్ద జనం బారులు
- అనర్హులను ఎంపిక చేశారంటూ అసంతృప్తి
- కొన్ని చోట్ల మధ్యలోనే సభలకు బ్రేక్
- 72,686 దరఖాస్తులు
జగిత్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలకు గ్రామసభల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గ్రామసభలో ప్రదర్శించిన జాబితాల్లో అనర్హులకు చోటు కల్పించారని మండిపడ్డారు. నిరసనలు, నిలదీతల నడుమ సభలు కొనసాగగా అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలన్న సూచనతో ఈ సభలు దరఖాస్తుల స్వీకరణ సభలుగా మారాయి. ఇలా నాలుగు రోజుల్లో జిల్లాలో నిర్వహించిన సభల్లో నాలుగు పథకాలకు 72,686 దరఖాస్తులు అందడం గమనార్హం. ఽధరఖాస్తుల సంఖ్యపై ఒకటి, రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుంద ని చెబుతున్నారు.
ఫ ఆగ్రహ జ్వాలలు
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో నాలుగురోజుల పాటు గ్రామ, వార్డు సభలను నిర్వహించారు. దాదాపుగా అన్ని సభల్లోనూ సంక్షేమ పథకాలకు ప్రదర్శించిన జాబితాలపై ప్రజల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాబితాల్లో అనర్హులు ఉన్నారని, అర్హులకు చోటు కల్పించలేదని అధికారులను నిలదీశారు. కొన్ని చోట్ల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో అధికారులు సభలను మధ్యలోనే ముగించి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక చివరి రోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి నెలకొనగా పలుచోట్ల బీఆర్‌ఎస్ నేతలు గ్రామస్థులకు మద్దతుగా నిరసన తెలిపారు. ప్రస్తుతం ప్రకటించింది తుదిజాబితా కాదని, ఇక్కడ అభ్యంతరాలు స్వీకరించి విచారణ అనంతరం అనర్హులను తొలగిస్తామని అధికరులు నచ్చచెప్పారు.
ఫ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్..
జిల్లాలో నిర్వహించిన గ్రామ, వార్డు సభలకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని జైనా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యంలతో పాటు కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి, నాలుగు రోజుల్లో పలుచోట్ల సభలను సందర్శించారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో జరిగిన సభలో లబ్ధిదారుల ఎంపికలో గ్రామ కార్యదర్శి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డాని ఆరోపణలు రావడం, అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడాన్ని కారణం చెప్పమంటూ పలువురు నిలదీశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు సదరు కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల గ్రామ సభలు గందరగోళంగా మారగా ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెళ్లి నచ్చచెప్పడంతో ఆందోళనలు సద్దుమనిగాయి.
ఫ చివరిరోజు గందర గోళంగా..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాలుగో రోజు శుక్రవారం నిర్వహించిన గ్రామ, వార్డు సభలు గందరగోళంగా జరిగాయి. జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఫ్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. గ్రామసభ సందర్భంగా ప్రదర్శించిన ఫ్లెక్సీలో బీఆర్‌ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఫొటో లేదంటూ ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. జిల్లాలోని మెట్‌పల్లి మున్సిపల్‌లోని 6వ, 21వ వార్డుల్లో, కోరుట్ల నియోజకవర్గం పైడిమడుగులో జరిగిన గ్రామసభలో నిర్వహించిన సభల్లో సైతం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదేవిధంగా జిల్లాలోని రాయికల్ మండలం అల్లీపూర్, ద్యావనపల్లి గ్రామాల్లో నిర్వహించిన సభల్లో అర్హులకు జాబితాలో చోటు కల్పించలేదని అధికారులను పలువురు మహిళలు నిలదీశారు.
ఫ దరఖాస్తుదారులతో కిటకిట...
జిల్లాలో నాలుగురోజుల పాటు నిర్వహించిన వార్డు సభలు, గ్రామసభల వద్ద జన సందోహం కనిపించింది. చాలా చోట్ల ప్రజలు నిరసనలు తెలిపారు. జాబితాల్లో పేర్లు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో బారులు దీరి సమర్పించారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్న వారు అధికంగా ఉన్నారు.