ఎట్టకేలకు రాయితీతో..
ABN , Publish Date - Feb 22 , 2025 | 01:09 AM
అనుమతిలేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)లో వచ్చిన దరఖాస్తులకు ప్రభుత్వం మరోసారి పచ్చజెండా ఊపింది. 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అనుమతిలేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)లో వచ్చిన దరఖాస్తులకు ప్రభుత్వం మరోసారి పచ్చజెండా ఊపింది. 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో అధిక సంఖ్యలోనే ముందుకు వచ్చే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామపంచాయతీల పరిఽధిలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ కోసం 42,942 దరఖాస్తులు వచ్చాయి. 2020 సెప్టెంబరులో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రజలపై మోయలేని భారం మోపిందనే అభిప్రాయంతో ఎవరూ దరఖాస్తులు చేసుకున్నా ముందుకు రానీ పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలు గ్రామపంచాయతీల్లో అక్రమ లేఅవుట్‌లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు సెప్టెంబరు 1, 2020న బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 26 అగస్టు 2020లోపు సేల్‌డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసిన లే అవుట్‌ల యజమానులు, ప్లాట్ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడో 20 ఏండ్ల క్రితం ఇండ్లు నిర్మించుకొని ఇంటి పన్నులు చెల్లించి క్రయవిక్రయాలు జరిపిన వారు కూడా ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించే పరిస్థితి నెలకొంది. లేనిపక్షంలో క్రయవిక్రయాలు జరిపే అవకాశం లేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్ పక్రియను వేగవంతం చేయడానికి నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రకటనలు చేసి సర్వేలు చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. గత సంవత్సరం జూలై నెలలో మున్సిపాలిటీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలించి పరిష్కరించే దిశగా దిశానిర్ధేశం చేసినా ఆశించిన మేరకు స్పందన రాలేదు. ఇతర సర్వేలతో దరఖాస్తుల పరిశీలన పూర్తికాలేదని తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం మార్చి 31లోపు దరఖాస్తు చేస్తే 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. లే అవుట్‌లలో కేవలం పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి, మిగిలినవి రిజిస్ట్రేషన్ కాకపోతే 90శాతం ప్లాట్లు క్రమబద్ధీకరణకు అనుమతించాలని నిర్ణయించారు. దీంతో దరఖాస్తుదారుల్లో కొంత ఊరట కనిపిస్తోంది. చాలామంది రియల్టర్లు అనుమతి లే అవుట్ ప్లాట్లు కొన్నవారు రూ 10వేల చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత రూ.1000 చొప్పున చెల్లించారు. ప్రస్తుతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులో కదలిక వస్తుందని భావిస్తున్నారు.
ఫ జిల్లాలో 42942 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు..
రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు వచ్చిన 42,942 దరఖాస్తుల్లో 19,141 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. ఇంకా 23,801 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 172 దరఖాస్తులకు సంబంధించిన ఫీజులు చెల్లించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,493 దరఖాస్తులు రాగా, 7,826 దరఖాస్తులు పరిష్కరించారు. 2,667 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 132 దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 16,336 దరఖాస్తులు రాగా 10,055 దరఖాస్తులు పరిష్కరించారు. 6,281 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 40 మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా 16,113 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,260 దరఖాస్తులు పరిష్కరించారు. 14,853 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కొ ప్లాట్‌కు గత మార్కెట్ ధరలకు అనుగుణంగా కనీసం రూ 20 నుంచి రూ 50 వేల వరకు ఆదాయం లభిస్తుంది. దీని ప్రకారం కనీసం రూ 40 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తుల్లో సిరిసిల్ల మున్సిపాల్టీలో 10వేల 493 దరఖాస్తులు, వేములవాడ మున్సిపాల్టీలో 16336 దరఖాస్తులు వచ్చాయి. గ్రామపంచాయతీల్లో వచ్చిన దరఖాస్తుల్లో బోయినపల్లి మండలంలో 20గ్రామపంచాయతీల్లో 645 దరఖాస్తులు, చందుర్తిలో 15 గ్రామపంచాయతీల్లో 213 దరఖాస్తులు, ఇల్లంతకుంటలో 24 గ్రామపంచాయతీల్లో 1054 దరఖాస్తులు, గంభీరావుపేటలో 17 గ్రామపంచాయతీల్లో 861 దరఖాస్తులు, కోనరావుపేటలో 15 గ్రామపంచాయతీల్లో 277 దరఖాస్తులు, వేములవాడ అర్బన్ మండలంలో తొమ్మిది గ్రామపంచాయతీల్లో 3,702 దరఖాస్తులు, ముస్తాబాద్ మండలంలో 1,074 దరఖాస్తులు, ఎల్లారెడ్డిపేట మండలంలో 16గ్రామపంచాయతీల్లో 3,949 దరఖాస్తులు, తంగళ్లపల్లిలో 26 గ్రామపంచాయతీల్లో 3,784 దరఖాస్తులు, వేములవాడ రూరల్ మండలంలో 15 గ్రామపంచాయతీల్లో 214 దరఖాస్తులు, రుద్రంగిలో రెండు గ్రామపంచాయతీల్లో 304 దరఖాస్తులు, వీర్నపల్లిలో మూడు గ్రామపంచాయతీల్లో 71 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలనకు క్లస్టర్‌లుగా విభజించి వెయ్యి దరఖాస్తులకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. అధికారులకు ఇతర సర్వేలు రావడంతో పెండింగ్‌లోనే పడిపోయింది. క్రమబద్ధీకరణ కోసం దాదాపు ఐదేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమ లేఅవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణకు 2015 నుంచి వివిధ దశల్లో లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అప్పుడు వచ్చిన దరఖాస్తులను రెండేళ్ల పాటు పరిశీలించి క్రమబద్ధీకరించారు. మళ్లీ 2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తెచ్చింది. లేఅవుట్ క్రమబద్ధీకరణలో దరఖాస్తులు ఆహ్వానించారు. ప్లాట్లకు సంబంధించి రూ.వెయ్యి చొప్పున, లేఅవుట్ క్రమబద్ధీకరణకు రూ.10వేల చొప్పున చెల్లించి దరఖాస్తులు సమర్పించారు. ఈ విషయంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ నిలిచిపోయింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకున్న వారికి భవన నిర్మాణ అనుమతుల్లో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించినా క్రమబద్ధీకరణ జరగలేదు. తాజాగా ప్రభుత్వం మార్చి 31లోగా చార్జీలు చెల్లిస్తే 25శాతం రాయితీకి సంబంధించిన జీవో 28 విడుదల చేయడంతో దరఖాస్తుదారులు ముందుకు వస్తారని భావిస్తున్నారు.