సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు....
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:00 AM
కరీంనగర్‌లో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన, సభ సందర్భంగా పార్టీశ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులు, బాధ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత మొదటిసారిగా కరీంనగర్‌కు వస్తుండడం పరిగణలోకి తీసుకుని అందుకు తగిన విధంగా పార్టీ తరపున ఏర్పాట్లు చేస్తున్నారు.

కరీంనగర్ అర్బన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన, సభ సందర్భంగా పార్టీశ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులు, బాధ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత మొదటిసారిగా కరీంనగర్‌కు వస్తుండడం పరిగణలోకి తీసుకుని అందుకు తగిన విధంగా పార్టీ తరపున ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌లోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులను ఫ్లెక్సీలు, కాంగ్రెస్‌పార్టీ తోరణాలు, భారీ హోంర్డింగ్‌లతో నింపివేశారు. ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లోనే మూడు రోజులుగా మకాం వేసి జనసమీకరణకు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతోపాటు మండల, గ్రామస్థాయి అధ్యక్ష, కార్యదర్ధులకు బాద్యతలు అప్పగించారు. మూడు రోజులుగా మంత్రులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ పట్టభద్రులను వర్గాలవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సభా వేదిక, మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రధాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఆదివారం పరిశీలించారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఎస్సారార్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోమవారం సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సభకు 15 వేల నుంచి 20 వేల మంది పట్టభద్రుల ఓటర్లు, ప్రజలను తరలించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో నుంచి సభకు జనాలను తరలించనున్నారు. సభ నిర్వహణ కోసం వేదిక ఏర్పాటుతో పాటు షామియానాలు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఫ భారీ బందోబస్తు
సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీసుబందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం సెలవులో ఉన్న కారణంగా సీఎం సభ ఇన్‌చార్జిగా సిరిసిల్ల ఎస్పీ అఖిల్‌మహాజన్ వ్యవహిరిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఇన్‌చార్జి ఎస్పీ అఖిల్ మహాజన్ సీఎం సభ వేదికతోపాటు, హెలిప్యాడ్, మైదానాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయంలోని హెలిప్యాడ్‌కు సోమవారం సాయంత్రం 4:25కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్సారార్ మైదానానికి చేరుకుంటారు. ఈ దారిపొడుగునా సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. సభ బందోబస్తు కరీంనగర్ అడిషనల్ డీసీపీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఆరుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, మరో 450 మంది ఏఎస్‌ఐ స్ధాయి నుంచి కానిస్టేబుల్, హోంగార్డుల వరకు సిబ్బందిని వినియోగిస్తున్నారు.