పొడిగింపా?.. ప్రత్యేకమా?
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:25 AM
అన్నదాతలకు విస్తృత సేవలు అందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) పాలకవర్గాల గడువు శుక్రవారంతో ముగిసిపోనుంది.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అన్నదాతలకు విస్తృత సేవలు అందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) పాలకవర్గాల గడువు శుక్రవారంతో ముగిసిపోనుంది. ఈనెల 15నుంచి పాలకవర్గాల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తుందా..? లేదా ఆరు నెలలపాటు పొడిగిస్తుందా అనే చర్చ ఒకవైపు కొనసాగుతున్నా ఎన్నికల నిర్వహణకు మాత్రం ఆరునెలల పాటు ఎదురుచూడాల్సిందే. ఇప్పటికే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోయి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా వ్యవసాయ సహకార సంఘాలు కూడా చేరనున్నాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో పొడిగింపు లేకపోవచ్చునని భావిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో డీసీసీబీ కొనసాగుతోంది. వీటి పరిధిలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 24 సహకార సంఘాల్లో 13మంది సభ్యుల చొప్పున 312మంది డైరెక్టర్లు ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఈనెల 14తో పదవీకాలం ముగుస్తుంది. 20న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు చైర్మన్, వైస్‌చైర్మన్ పదవుల ఎన్నికలు కూడా నిర్వహించారు. సాధారణంగా సొసైటీల కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం ఎన్నికల పక్రియ ప్రారంభించి గడువు ముగిసేలోగానే ఎన్నికల పక్రియ పూర్తి చేసేది. ప్రభుత్వం ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టడంతో ప్రత్యేక అధికారుల పాలన అనివార్యంగానే మారింది. మరోవైపు అధికార పార్టీకి చెందిన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతున్నారు. పొడిగింపు పక్రియ ముందుకు వస్తే ఆరు నెలల పాటు ఉంటాయి. మరో రెండు రోజుల్లో పాలకవర్గాల గడువు ముగుస్తున్న దానిపై ఎలాంటి నిర్ణయం రాబోతుందనే ఆసక్తి నెలకొంది. సహకార సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది.
సొసైటీల్లో 74,728 మంది సభ్యులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో 74,728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12,859 మంది సభ్యులు ఉండగా, పెద్దూరు సొసైటీలో 1,336 మంది, నేరెల్ల సొసైటీలో 1,257 మంది, కోనరావుపేట సొసైటీలో 6,196 మంది, కొలనూరు సొసైటీలో 3,018 మంది, వేములవాడ సొసైటీలో 8,180 మంది, నాంపెల్లి సొసైటీలో 1,191 మంది, రుద్రవరం సొసైటీలో 998 మంది, చందుర్తి సొసైటీలో 3,369 మంది, సనుగుల సొసైటీలో 1,733 మంది, బోయినిపల్లి సొసైటీలో 910 మంది, కోరెం సొసైటీలో 1,694 మంది, మాన్వాడ సొసైటీలో 1,163 మంది, నర్సింగాపూర్ సొసైటీలో 1,684 మంది, ఇల్లంతకుంట సొసైటీలో 3,547 మంది, గాలిపెల్లి సొసైటీలో 1,680 మంది, ముస్తాబాద్ సొసైటీలో 2,082 మంది, పోత్గల్ సొసైటీలో 7,169 మంది, గంభీరావుపేట సొసైటీలో 8,183 మంది, కొత్తపెల్లి సొసైటీలో 3,680 మంది, ఎల్లారెడ్డిపేట సొసైటీలో 3,864 మంది, అల్మాస్‌పూర్ సొసైటీలో 2,139 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 1,597 మంది, మానాల సొసైటీలో 199 మంది సభ్యులు ఉన్నారు.
సహకార సంఘాల విస్తరణపై ఆశలు..
సహకార రంగంలో విస్తృతంగా సేవలందిస్తున్న వ్యవసాయ సహకార సంఘాల విస్తరణ జరుగుతుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యవసాయ సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేయాలని, ప్రతి మండలానికి రెండు ఉండేలా సూచనలు చేసిన క్రమంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ఆఆదేశాలు ఇచ్చినా ఎన్నికల కోడ్‌తో పక్రియ ముందుకు సాగలేదు.తాజాగా మళ్లీ పునర్విభజనపై దృష్టిపెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం ఉన్న 24 సహకార సంఘాలకు తోడుగా జిల్లాలో 9 సింగిల్ విండోలు కొత్తగా పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను విభజించడంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు. దీనికి తోడుగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు కోరినా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2019లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 5 వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు. మండలానికి రెండు సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు 25 రకాల సేవలు అందించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మళ్లీ తాజాగా 9 సంఘాల పెంపునకు ప్రతిపాదనలు చేశారు.
ఓటర్లు 35,776 మంది..
జిల్లాలో ప్రస్తుతం 24 సహకార సంఘాలు ఉండగా, 74728 మంది సభ్యులు ఉన్నారు. ఓటుహక్కు కలిగిన వారు 35,776 మంది ఉన్నారు. గత ప్రభుత్వం మండలానికి రెండు సంఘాలు ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలో 13 మండలాలు ఉండగా, 24 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా తంగళ్లపల్లి, మర్రిపల్లి, వట్టెంల, వీర్నపల్లి, గర్జనపల్లి, రుద్రంగి సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు గతంలో పంపించారు. కొత్త సంఘాలు ఏర్పడిన తర్వాత సింగిల్‌విండో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా, కొత్త సంఘాలు ఏర్పడకముందే ఎన్నికల నిర్వహణ పూర్తిచేశారు. కొత్త సంఘాల ప్రతిపాదనలు మూలనపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుకు నిర్ణయించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర సహకార బ్యాంక్ సేవలను అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో తాజాగా 9 సింగిల్‌విండోలు ఏర్పాటుకానున్నాయి. రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీకి సింగిల్ విండోలు తోడ్పడుతున్నాయి.