ముగియనున్న గడువు
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:02 AM
మున్సిపల్ పాలకవర్గాల సమయం దగ్గర పడుతోంది. మరో తొమ్మిది రోజుల్లో గడువు ముగిసిపోనుండడంతో బకాయిల వసూళ్ల కోసం కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. మరోవైపు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించినా నిధుల కొరతతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

- ఈ నెల 26 వరకే బల్దియా పాలకవర్గాల పాలన
- బకాయిల వసూళ్లపై కౌన్సిలర్లు, కాంట్రాక్టర్ల దృష్టి
- 27 నుంచి ప్రత్యేక అధికారుల పాలన
- సిరిసిల్ల, వేములవాడ బల్దియాలో కొత్త రాజకీయాలు
- ఎన్నికలకు ఆశావహుల ఎదురు చూపులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
మున్సిపల్ పాలకవర్గాల సమయం దగ్గర పడుతోంది. మరో తొమ్మిది రోజుల్లో గడువు ముగిసిపోనుండడంతో బకాయిల వసూళ్ల కోసం కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. మరోవైపు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించినా నిధుల కొరతతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. 2020 జనవరి 27న పాలకవర్గాలు కొలువు దీరాయి. ఈ నెల 26తో పదవీకాలం ముగుస్తున్న క్రమంలో 27 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానుంది. మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. ఈ సారి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవడానికి ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవి చైర్‌పర్సన్లుగా బాధ్యతలు చేపట్టారు. రెబల్ అభ్యర్థులుగా గెలుపొందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మళ్లీ సొంతగూటికి చేరారు. ప్రభుత్వ ఉండడం, మంత్రి కేటీఆర్ కీలకంగా ఉన్న నేపఽథ్యంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల హవానే కొనసాగింది. 2023లో జరిగిన ఎన్నికలు రాజకీయ పరిణామాలను తారుమారు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో నిధులు మున్సిపాలిటీలకు సన్నగిల్లాయి. ప్రభుత్వం మారడంతో వేములవాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన ఆది శ్రీనివాస్ రావడంతో అక్కడ అభివృద్ధి వైపు అడుగులు పడ్డాయి. సిరిసిల్ల పూర్తిగా వెనకబడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ పాలకవర్గాల గడువు కూడా ముగియనుండడంతో ప్రత్యేక పాలన అధికారుల తీరు ఎలా ఉండబోతున్నదనే చర్చ సాగుతోంది.
బల్దియా రాజకీయం మారుతుందా?
సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో ఉత్కంఠగానే రాజకీయాలు సాగాయి. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండడంతో రెండు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో గెలుపు గుర్రాలకు అవకాశం ఉన్నా సిరిసిల్లలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థుల కోసం వెతుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బల్దియా రాజకీయం మారుతుందా? అనే చర్చ కూడా ఉంది. 2020లో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్లలో 39 వార్డులు, వేములవాడలో 28 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 67 వార్డుల్లో ఐదు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమవగా 62 వార్డుల్లో 274 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీఆర్‌ఎస్, రెబల్ అభ్యర్థుల మధ్యే పోటీ అన్నట్లుగా సాగింది. రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులే మెజార్టీ సీట్లను గెలుపొందారు. 67 వార్డుల్లో ఏకగ్రీవంతో కలుపుకొని 38 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 3 సీట్లు, బీజేపీ 9 , స్వతంత్రులు 17 స్థానాల్లో గెలుపొందారు. సిరిసిల్ల మున్సిపాలిటీ