Share News

లబ్ధిదారుల ఎంపికలో నిమగ్నం

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:24 AM

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపికలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. బుధవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, రాముగండం, మంథని నియోజకవర్గాల స్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి ఆయా పథకాల లబ్ధిదారులను ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.

   లబ్ధిదారుల ఎంపికలో నిమగ్నం

- 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..

- ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లోకి..

- కొత్త రేషన్‌ కార్డుల మంజూరు

- 21నుంచి గ్రామ, పట్టణ గ్రామసభలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపికలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. బుధవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, రాముగండం, మంథని నియోజకవర్గాల స్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి ఆయా పథకాల లబ్ధిదారులను ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలతో పాటు మరిన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈనెల 26వ తేది నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్‌ కార్డులను మంజూరుచేయనున్నారు. ఆయా పథకాల కోసం ప్రభుత్వం డిసెంబరు 26 నుంచి జనవరి 8వ తేదీ వరకు గ్రామ, పట్టణ సభలను నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా 1,80,664 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,28,972 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల్లో 61,692 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో మొదటి విడత ఇంటి స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేయనున్నారు. ప్రధానంగా గుడిసెలో ఉన్న వారికి, పాత ఇళ్లపై టార్ఫాలిన్లు కప్పి ఉన్న గృహాల కుటుంబాలకు, అనాథలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎలాంటి భూమి లేని వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌, సఫాయి కర్మచారి, అట్టడుగున ఉన్న గిరిజనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే రైతు భరోసాను రాళ్లు, రప్పలు కలిగిన భూములకు, రియల్‌ ఎస్టేట్‌ కోసం వెంచర్లు చేసిన భూములకు, ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు గాకుండా పంటలను సాగుచేసే భూములు కలిగిన రైతులకే ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున రెండు పంటలకు కలిపి 12 వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఎలాంటి భూపరిమితి విధించకుండా రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు కలిసి సాగు భూములను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఆ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఫ జిల్లాలో 2 లక్షల 60 వేల ఎకరాల సాగుభూమి..

వ్యవసాయ శాఖాధికారులు తీసిన లెక్కల ప్రకారం జిల్లాలో 2 లక్షల 60 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి. ఈ భూములు కలిగిన రైతులందరికీ రైతు భరోసా పథకం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి 12 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఏడాదికి 312 కోట్ల రూపాయలు ఈ పథకం కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నారు. జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఆధార్‌ సీడింగ్‌ అయిన కూలీలు 1,19,062 మంది ఉండగా, ఇందులో 79,974 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్లగా, 20 దినాల పాటు పని చేసిన కూలీలు 39,326 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఎలాంటి భూములు లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు కూలీల వివరాలను కలెక్టర్‌కు అందించారు. అలాగే గడిచిన రెండో విడత బీఆర్‌ఎస్‌ పాలనలో ఐదేళ్లలో 2021లో ఒకసారి మాత్రమే రేషన్‌ కార్డులను జారీ చేశారు. ఈ ప్రభుత్వం కూడా రేషన్‌ కార్డులు ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వచ్చారు. గత నెలలో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి రేషన్‌ కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది నిర్వహించిన ప్రజాపాలన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల కోసం 23 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను ప్రదర్శించనున్నారు. 25వ తేదీ వరకు నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారుల తుది జాబితాను పూర్తి చేసి 26వ తేదీ నుంచి కొత్త పథకాలను అమలు చేయనున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 01:24 AM