చేపల పెంపకానికి ప్రోత్సాహమేదీ!
ABN , Publish Date - Mar 01 , 2025 | 01:21 AM
దేవుడు వరమిచ్చినా పూజారి వరమియనట్లు’గా ఉంది జిల్లా మత్స్య శాఖాధికారుల పరిస్థితి. వ్యవ సాయానికి ప్రత్యామ్నాయంగా సాగు భూముల్లో చేపల పెంపకం చేపట్టే వారికి సబ్సిడీ అందజేస్తామని ఆరేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు, రైతులు చేపల పెంప కం చేపట్టేందుకు ముందుకు రాగా, వారిని ప్రోత్స హించాల్సిన జిల్లా మత్స్య శాఖాధికారులు డీఎల్‌సీ ద్వారా అనుమతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుం డడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు
- లక్షలు వెచ్చించి పాండ్లు తవ్వుకుని డీఎల్‌సీ కోసం ప్రదక్షిణలు
- కేంద్ర ప్రభుత్వ సబ్సిడీకి నోచుకోని మత్స్యకారులు
- పట్టించుకోని జిల్లా మత్స్య శాఖాధికారులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమియనట్లు’గా ఉంది జిల్లా మత్స్య శాఖాధికారుల పరిస్థితి. వ్యవ సాయానికి ప్రత్యామ్నాయంగా సాగు భూముల్లో చేపల పెంపకం చేపట్టే వారికి సబ్సిడీ అందజేస్తామని ఆరేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు, రైతులు చేపల పెంప కం చేపట్టేందుకు ముందుకు రాగా, వారిని ప్రోత్స హించాల్సిన జిల్లా మత్స్య శాఖాధికారులు డీఎల్‌సీ ద్వారా అనుమతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుం డడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులున్న జిల్లాల్లో వ్యవసాయానికి ప్రత్యామ్నా యంగా చేపల పెంపకం చేపట్టాలని, ప్రోత్సాహకంగా ఆరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని తీసుకవచ్చింది. ఆయా జిల్లాలకు టార్గెట్లు సైతం విధించింది. చేపల పెంప కానికి పాండ్లు తవ్వుకుని నీటి వసతి కల్పించేందుకు పాండ్ల వద్దకు పైపులైన్ల నిర్మాణానికి, వలలు కొనుగోలు చేసేందుకు యూనిట్ వ్యయంలో సబ్సిడీలు ఇస్తామని ప్రకటించింది. చేపల పెంపకాన్ని మహిళలు చేపడితే 60 శాతం, పురుషులైతే 35 శాతం సబ్సిడీని ఇస్తున్నారు. చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు హేచరీల ఏర్పాటుకు మహిళలకు 60, పురుషులకు 45 శాతం సబ్సిడీ ఇవ్వ నున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మానేరు, గోదావరి తీరప్రాంతాలైన ముత్తారం, ఓడేడు, గుంజపడుగు, అడవిశ్రీరాంపూర్, కాల్వశ్రీరాంపూర్, గోదావరిఖనిలలో వ్యవసాయ భూముల్లో కొందరు మత్స్యకారులు, రైతులు చేపల పెంపకానికి ముందుకు వచ్చారు. దాదాపు 60 మంది వరకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) నుంచి అనుమతులు ఇప్పించాలని జిల్లా మత్స్య శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
ముత్తారంలో అనుము రామస్వామి, తిరుపతి అనే మత్స్యకారుడు తన సోదరులతో కలిసి చేప పిల్లల ఉత్పత్తి కోసం హేచరీని ఏర్పాటుచేశారు. ఐదారేళ్లుగా డీఎల్‌సీ అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరు గుతున్నా ప్రయోజనం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 లక్షలు వెచ్చించి హేచరీ ఏర్పాటు నిర్మించారు. అలాగే చేపల పెంపకానికి లక్షలు వెచ్చించి పాండ్లు తవ్వుకున్నారు, కానీ వారికి సబ్సిడీల రూపేణా ప్రోత్సాహం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
- ఆరేళ్లుగా ఇవ్వని డీఎల్‌సీ అనుమతులు
జిల్లా స్థాయి కమిటీలో జిల్లా మత్స్య అధికారి, నీటి పారుదల శాఖాధికారి, భూగర్భ జల శాఖాధికారి, వ్యవసాయ శాఖాధికారి సభ్యులుగా ఉంటారు. ఎవరైతే చేపల పెంపకానికి పాండ్లు తవ్వుకోవడానికి, తవ్వుకున్న వాళ్లు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకుంటారో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే చేపల పాండ్లు తవ్వుతారో అక్కడ నీటి వసతి ఉందా, భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఆ ప్రాంతం చేపల పెంపకానికి అనువైనదేనా అని పరిశీ లించాలి. అనువుగా ఉన్నట్లయితే డీఎల్‌సీ ద్వారా అను మతులు ఇవ్వాలి. ఇందుకు మత్స్య శాఖాధికారి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి. కానీ జిల్లా ఏర్పాటై ఎనిమిదేళ్లు గడిచినా కూడా ఒక్కరికి అనుమతులు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినా మత్స్యకారులు, రైతులు చేపల పాండ్లు తవ్వుకుని చేపలు పెంచుతున్నారు.
- అందని కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ..
ఒక ఎకరంలో చేపల చెరువులు (పాండ్లు) తవ్వా లంటే లక్ష నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. డీఎల్‌సీ అనుమతులు ఇచ్చినట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి దరఖాస్తు చేసుకుం టారు. సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి సబ్సిడీని మంజూరు చేస్తారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుక వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు రైతులు, మత్స్యకారులు సిద్ధంగా ఉన్నప్పటికీ జిల్లా అధికారులు సహకరించక పోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. ఇప్పటికే చేపల చెరువులు తవ్వుకున్న తమకు డీఎల్‌సీ అనుమతులు ఇవ్వకపోవడంతో ఆసక్తి ఉన్న పలువురు రైతులు ఆర్థిక స్థోమత లేక ముందుకు రావడం లేదని చెబుతున్నారు. డీఎల్‌సీ ఇవ్వని పర్య వసానంగా రైతుభరోసాను కోల్పోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టా కలిగిన రైతులందరికీ రైతుబంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం ద్వారా ఈ సీజన్ నుంచే అమలు చేస్తున్నారు. సాగు భూములకే రైతు భరోసా ఇస్తుం డడంతో ఎకరానికి 6 వేల చొప్పున దక్కకుండా పోతు న్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎల్‌సీ విషయమై గత నెల 20, ఈ నెల 22న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ప్పటికీ, ఇప్పటి వరకు మత్స్య శాఖ అధికారుల్లో చలనం లేకుండా పోయింది.
ఆరేళ్లుగా అనుమతుల కోసం తిరుగుతున్నాం..
- అనుము రామస్వామి, మత్స్యకారుడు, ముత్తారం
మాది మంథని ముత్తారం. ముత్తారంలో 25 లక్షలతో హేచరీ ఏర్పాటుచేశాం. ఓడేడులో దాదాపు 15 ఎకరాల్లో చేపల పెంపకానికి పాండ్లు తవ్వుకున్నాం. ఇందుకు 25 లక్షల రూపాయలకు పైగా వెచ్చించాం. డీఎల్‌సీ అను మతుల కోసం జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దర ఖాస్తు చేసుకున్నాం. మాతో పాటు మరికొందరు దర ఖాస్తు చేసుకున్నారు. కానీ మత్స్య శాఖాధికారులు డీఎల్‌సీ ద్వారా అనుమతులు ఇవ్వడం లేదు. డీఎల్‌సీ అనుమతులు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోయాం. జిల్లాలో ఏకైక హేచరీని తామే ఏర్పాటు చేశాం. జిల్లా అవసరాలకు చేప పిల్లలను ఉత్పత్తి చేయగలుగుతాం. కానీ అనుమతులు ఇవ్వడం లేదు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలి.