జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:45 AM
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరీంనగర్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి, 1950న అమల్లో వచ్చిందన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు.
ఫ జిల్లాలోని 16,565 ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన జిల్లాలోని 16,565 మంది ఉపాధి కూలీలను ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించి గ్రామ సభల్లో ఆమోదించారని అన్నారు. ఈ ఆమోదం అనంతరం వారికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా ఆర్థిక సాయం చెల్లిస్తామనిని కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. రైతు భరోసా సహాయాన్ని ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తోందని, వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఆదివారం నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.
ఫ రేషన్ కార్డులకు 40 వేల దరఖాస్తులు
అర్హులైన నిరుపేదలందరికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డులలో మార్పులు చేర్పుల కోసం సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తులను పరిశీలించి పారదర్శకంగా అర్హులకు రేషన్‌కార్డులను జారీ చేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. జిల్లాలో 2.1 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వాటి పరిశీలన అనంతరం సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ళ మంజూరు చేస్తామని తెలిపారు.
ఫ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు రూ. 125.5 కోట్ల లబ్ధి
మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 9 డిసెంబనే 2023 నుంచి ఇప్పటి వరకు 3.14 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీంతో మహిళలు 125.5 కోట్ల రూపాయల లబ్ధి పొందారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 20,474 మంది పేదలకు ఉచిత చికిత్సను అందించామని అన్నారు. ఈ పథకంలో కొత్తగా 163 చికిత్సలను ప్రభుత్వం చేర్చిందని అన్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 1,837 చికిత్సలకు వైద్యం అందుతోందని అన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ అవార్డుకు ఎంపికైందని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు వంట గ్యాస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు మన జిల్లాలో 1,43,899 గ్యాస్ కనెక్షన్లకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో 1,6404 కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని, ప్రభుత్వం ఇప్పటి వరకు 5.09 కోట్ల రూపాయలను సబ్సిడీగా చెల్లించిందని అన్నారు.
ఫ 79,541 మంది రైతులకు రుణమాఫీ
జిల్లాలో రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణ మాఫీ చేశామని, జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు విడతల్లో కలిపి 79,541 మంది రైతులకు 622.06 కోట్ల రూపాయలు రుణ మాఫీ చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలోని 344 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో దాదాపు 14 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించామని, 157 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 30 వేల మంది విద్యార్థులకు ఒక జత షూ, మూడు జతల సాక్స్‌లు ఉచితంగా అందించామన్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నైపుణ్యం సాధించేందుకు టెట్ ఎడ్, ఒలంపియాడ్, యాక్టింగ్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంతో పాటు కెరియర్ కౌన్సెలింగ్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 68,488 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ప్రతీ నెలా 396 టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం డైట్, కాస్మొటిక్స్ చార్జీలు పెంచుతూ ప్రకటించిన కామన్ డైట్ మెనూను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. హాస్టల్లో చదివే విద్యార్థులకు ఒకే రకమైన సమతుల పోషకాహారం అందిస్తున్నామన్నారు.
ఫ వానాకాలం సీజన్‌లో 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2,36,805 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు సన్న రకం పండించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా 11,901 మంది రైతుల నుంచి 72,132 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేశామన్నారు. సన్న రకాలకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున మెత్తం 33.12 కోట్ల రూపాయలు బోనస్‌ను రైతుల ఖాతాలో జమ చేశామని కలెక్టర్ తెలిపారు.
ఫ మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని, మహిళల ఆరోగ్యం పోషకాహార స్థితిని మెరుగు పరిచేందుకు సామాజిక సమస్యలు పరిష్కరించేందుకు ఈ సభ తోడ్పాటునిస్తోందని అన్నారు. జిల్లాలో స్నేహిత కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళందరికి 50 వేల రూపాయలు ఖరీదు చేసే 59 రకాల వైద్య పరిక్షలను ఉచితంగా చేయిస్తున్నామని అన్నారు. డీఆర్‌డీఏ, మెప్మా శాఖల ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద 423 వ్యక్తిగత యూనిట్లకు 8.12 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, దీంతో పాటు 60 గ్రూపు యూనిట్లను ఏర్పాటు చేసి 5.73 కోట్ల కేటాయించడం జరిగిందని అన్నారు. జిల్లా అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు 59 మంది ఆపదమిత్ర వలంటీర్లకు శిక్షణ ఇచ్చారన్నారు.
ఫ విద్యా సంస్థల్లో కాన్షియస్‌నెస్ క్లబ్‌లు
మాదక ద్రవ్యాల నివారణకు అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో కాన్షియస్ నెస్ క్లబ్బులను ఏర్పాటు చేశామన్నారు. 16, 319 మంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ యేడు జిల్లా నుంచి 90 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. సీఎం కప్-2024లో భాగంగా జిల్లాకు చెందిన 48 మంది క్రీడాకారులు పతకాలు సాధించారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ యాదగిరి సునీల్‌రావు, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు.