Share News

ఎమ్మెల్సీ ఫలితాలను రెఫరెండంగా భావిస్తారా..

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:13 AM

కాంగ్రెస్‌ 14 నెలల పాలన బాగుందని అంటున్న సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఫలితాలను రెఫరెండంగా భావిస్తారా..

కరీంనగర్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ 14 నెలల పాలన బాగుందని అంటున్న సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని మాత్నమే వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యుత్‌ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్‌ లోకూర్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చి మూడు నెలలైనా ఎందుకు బయటపెట్టలేదన్నారు. ఫార్ములా ఈరేసు కేసులో కేటీఆర్‌ వల్లే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డే చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ గడువును పొడగిస్తున్నారే తప్ప కేసీఆర్‌ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని, దోషులందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తామన్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్‌ అంటే రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండ రెడ్డి కూడా వరి వేయొద్దు వేస్తే నష్ట పోతారని రైతులను హెచ్చరిస్తున్నారన్నారు. పొరుగు రాష్ట్రానికి నీటిని దోచి పెట్టడం వల్లే ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డా నీటి కటకట ఎందుకు వచ్చిందన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేసేది బీజేపీ పార్టీ మాత్రమే అన్నారు. బీజేపీని ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలరాంచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ సునీల్‌రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:13 AM