Share News

బీఆర్‌ఎస్‌ ఆర్థిక విధ్వంసం చేసినా అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తున్నాం

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:59 AM

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినా తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

  బీఆర్‌ఎస్‌ ఆర్థిక విధ్వంసం చేసినా అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తున్నాం
సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌, పక్కన ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్‌

- కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం తెచ్చావో చెప్పి ఎమ్మెల్సీ ఓట్లు అడగాలి

- రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పదేళ్లలో బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినా తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27న నిర్వహించనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల మైదానంలో నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీదర్‌బాబు హాజరుకానున్నారని తెలిపారు. తమ ప్రభుత్వంలో సిరిసిల్ల చేనేత కార్మికుల బకాయిలను తీర్చడంతోపాటు ఉపాధి కల్పించామని, మహిళా సంఘాలకు చీరల ఆర్డర్‌ ఇచ్చి అండగా నిలిచామని అన్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం కోసం సీఎం నిధులు కేటాయించి, శంకుస్థాపన చేశారన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేములవాడను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిందేగానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మానేరు ముంపు గ్రామాల బాధితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 4,600 ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్శిటీకి మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే లా కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ వస్తున్నాయన్నారు. ఆది, సోమవారాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. రెండుసార్లు కరీంనగర్‌ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్‌కుమార్‌ ఆరేళ్లలో కరీంనగర్‌పార్లమెంట్‌ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని, ఆ తర్వాతనే ఎమ్మెల్సీ ఓట్లు అడగాలని అన్నారు. ఎంపీగా ఉన్నపుడు కరీంనగర్‌లో పాస్‌పోర్టు ఆఫీస్‌, తిరుపతికి రైలు, మోడల్‌ స్కూల్‌, కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చానని చెప్పుకునే ధైర్యం తనకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తే బీజేపీ అడ్డుకుంటూ ఆఫిడవిట్‌ ఇచ్చిందన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తే బీజేపీ నాయకులు మత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్‌ నిర్ణయం బలహీనవర్గాలో మార్పు తీసుకురాబోతోందన్నారు. ఈనెల 24న సీఎం సభకు ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త పట్టభద్రులైన ఓటరును తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ రియాజ్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, హుజూరాబాద్‌ ఇన్‌చార్జి ప్రణవ్‌బాబు, కేకే మహేందర్‌రెడ్డి, నాయకులు పద్మాకర్‌రెడ్డి, నాగుల సత్యం, సంగీతం శ్రీనివాస్‌, సత్యప్రసన్నారెడ్డి, గడ్డం విలాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:59 AM