Share News

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లో కోత

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:07 AM

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 1, 2024 నుంచి మార్చి 31, 2025తో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కాలపరిమితి ముగిసింది.

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లో కోత

- సవరించిన వేతనాలతో విధుల్లోకి చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

- ఆందోళన చెందుతున్న ఉద్యోగులు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 1, 2024 నుంచి మార్చి 31, 2025తో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కాలపరిమితి ముగిసింది. దీంతో కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి జీవో ఆర్‌టి 69, తేదీ 1.2.205 రోజున 30,955 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కొనసాగింపునకు పరిపాలన మంజూరు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులంతా మరో ఏడాది పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చని సంతోషించారు. నాలుగేళ్లుగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచలేదు. ఈ సంవత్సరం అయినా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేతనాలను పెంచాల్సిన ప్రభుత్వం పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఎలక్ర్టీషియన్లు, సబార్డినేట్‌ ఉద్యోగుల వేతనాలను సవరించింది. ఈ క్రమంలో ప్రస్తుతం తీసుకున్న వేతనాల కంటే దాదాపు 25 శాతం తగ్గిస్తూ ప్రజారోగ్య కార్మికులు కాని వారికి 15,600, పీహెచ్‌వర్కర్లు, డ్రైవర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ల వేతనాలను ఒకే కేటగిరిలో 16,600 రూపాయలుగా నిర్ణయించింది. ఈ వేతనాలతో ఉద్యోగులను తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వారు 19,600, 20,950, 21,950 వేతనాలతో పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ జీవోతో తమ వేతనాలతో 25 శాతం కోత పడిందంటూ ఆందోళన చెందుతున్నారు.

ఫ అసలే అరకొర వేతనం.. అందులో కోతలు

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో 1,118 మంది పీహెచ్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. 105 మంది డ్రైవర్లు, 26 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, 50 మంది నాన్‌ పీహెచ్‌ వర్కర్లకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమై, ఆరోగ్యాలను ఫణంగా పెట్టి దుమ్మూ ధూళి, చెత్తాచెదారంలో పనిచేస్తున్న తమ వేతనాల్లో కోత విధించడం అన్యాయమని అంటున్నారు. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌ ఉద్యోగులకు జీతభత్యాలను పెంచుతున్న ప్రభుత్వం తమపై ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, స్కూల్‌ ఫీజులు, వైద్య ఖర్చులను భరించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఎప్పటికైనా తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశతో ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేస్తున్నామని, తమ వేతనాలను పెంచాలే తప్పా సవరించడం సరికాదని వారంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పట్ల సానుకూలధోరణితో ఆలోచించి తగ్గించిన వేతనాలను సవరించడంతోపాటు ప్రస్తుతం ఉన్న వేతనాలను 25 శాతం పెంచాలని కోరుతున్నారు.

ఫ వేతనాలను తగ్గించడం మతిలేని చర్య

- కేంద్రహోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న డ్రైవర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలను పెంచాల్సిన ప్రభుత్వం 25 శాతం తగ్గించడం మతిలేని చర్య. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ శానిటేషన్‌ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. పెరుగుతున్న ఽఖర్చులకు అనుగుణంగా వేతనాలను పెంచకుండా భారీగా కోత విధించడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని చెల్లించడం లేదు. జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్మును డ్రా చేసుకోకుండా ఇబ్బంది పెడుతోంది. రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఈ పొరపాటును సరిదిద్దుకొని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలి.

ఫ వేతనాలు తగ్గించడం దుర్మార్గం

- మాజీ మేయర్‌, బీజేపీ నేత యాదగిరి సునీల్‌రావు

మున్సిపాలిటీల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి చెత్తలో పనిచేస్తున్న కార్మికులకు ఏ ప్రభుత్వం అయినా వేతనాలు పెంచి వారి క్షేమం కోరుతుంది.. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల వేతనాలను తగ్గించి ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంచాలి.

Updated Date - Mar 08 , 2025 | 01:07 AM