‘చీట్’ఫండ్స్‌పై కొరఢా
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:17 AM
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. అన్నట్లుగా సభ్యులను మోసగించిన చిట్‌ఫండ్ సంస్థల నిర్వాహకులపై కరీంనగర్ పోలీస్‌కమిషనర్ అభిషేక్ మొహంతి కఠిన చర్యలకు ఉపక్రమించారు.

- బాధితులకు అండగా ఆస్తుల అటాచ్‌మెంట్ ‘అస్త్రం’
- మరో 3 చిట్‌ఫండ్స్‌పై చర్యలు?
- మోసాలపై 50 కేసులు, 16 మంది అరెస్టు
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. అన్నట్లుగా సభ్యులను మోసగించిన చిట్‌ఫండ్ సంస్థల నిర్వాహకులపై కరీంనగర్ పోలీస్‌కమిషనర్ అభిషేక్ మొహంతి కఠిన చర్యలకు ఉపక్రమించారు. కరీంనగర్‌లోని కొన్ని చిట్‌ఫండ్స్ నిర్వాహకులు సభ్యుల వద్ద చిట్ వేయించి ఆ డబ్బులను డిపాజిట్ల రూపంలో సేకరించి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాధితులను మోసం చేసినట్లుగా గుర్తించిన పోలీస్ కమిషనర్ కేసులు, అరెస్టులతో సరిపెట్టకుండా సీఐడీ ద్వారా ఆ సంస్థల ఆస్తులను అటాచ్‌మెంట్ చేయిస్తున్నారు. మరో 3 చిట్‌ఫండ్స్‌పై కూడా ఆస్తుల అటాచ్‌మెంట్ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. చిట్‌ఫండ్స్ నిర్వాహకులతో పాటు జిల్లా వ్యాప్తంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులు ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న జీరో చిట్‌లపై కూడా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. నిఘా పోలీసులు సమాచారం సేకరించగా త్వరలో వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చిట్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతిమయం
చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ సంస్థల లావాదేవీలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి ప్రభుత్వానికి పన్ను వసూలు చేయటంతో పాటు చిట్ సభ్యులను మోసం చేయకుండా చూడాల్సిన చిట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. చిట్ డబ్బులు చెల్లించడం లేదని సభ్యులైన బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. జీరో చిట్స్ నిర్వహించకుండా చూడాల్సిన చిట్ రిజిస్ట్రార్ అధికారులు ఆయా చిట్‌ఫండ్స్‌లలో తనిఖీలు చేయకుండా సభ్యులదే తప్పు అనే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిట్‌ఫండ్స్‌లో ఒక చిట్ నిర్వహణకు చిట్ మొత్తం డబ్బులు చిట్ రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చిట్ పూర్తి అయినప్పటికీ ఎవరైనా సభ్యులకు చిట్ డబ్బులు చెల్లించని సందర్భంలో నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్స్‌కు చెందిన డిపాజిట్ డబ్బుల నుంచి ఆ సభ్యుడికి డబ్బులు చెల్లించే అధికారం చిట్ రిజిస్ట్రార్ అధికారులకు ఉంటుంది. చిట్‌ఫండ్స్ నిర్వాహకులతో ములాఖత్ అయిన చిట్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు చిట్ డబ్బులు సభ్యులందరికీ చెల్లించారా? లేదా? అనేది సరిచూసుకోకుండా ఆ సంస్థల డిపాజిట్‌లను రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఒక చిట్‌ఫండ్స్‌లో సభ్యులకు డబ్బులు చెల్లించకుండానే ఆ సంస్థకు చెందిన డిపాజి ట్‌ను రిలీజ్ చేయగా ఒక అధికారి సస్పెన్షన్‌కు గురయ్యాడు.
కేసులు నమోదు
చిట్ గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించాల్సిన సంస్థలు చిట్ డబ్బులతో రియల్ వెంచర్లు వేసి ఓపెన్‌ఫ్లాట్‌లను రెట్టింపు ధరతో అంటగడుతున్నారు. ఎంతో కొంత చేతికి వస్తుందనే ఆశతో బాధితులు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. గడిచిన ఏడాది కాలంలో చిట్‌ఫండ్స్ నిర్వాహకులు సభ్యులకు డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడిన ఘటనలపై 50 కేసులు నమోదు కాగా, 16 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో చిట్‌ఫండ్స్ చైర్మన్, డైరెక్టర్లు 9 మందిని అరెస్టు చేయటం గమనార్హం. చిట్‌ఫండ్స్ మోసాలు అధికమవటం, చిట్ సభ్యుల సమస్యలు పరిష్కరించాల్సిన చిట్ రిజిస్ట్రార్ శాఖ అధికారులు చేతులెత్తేయటంతో బాధితులు వందల సంఖ్యలో పోలీస్‌కమిషనర్ అభిషేక్ మొహంతిని ఆశ్రయించారు. పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయటంతో చాలా చిట్‌ఫండ్స్ నిర్వాహకులు దారికి వచ్చి బాధితులతో రాజీ కుదుర్చుకుని వాయిదా పద్ధతిలో చెల్లింపులు చేస్తున్నట్లు సమాచారం.