అధికారుల వైఖరితోనే వివాదాలు
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:02 AM
రామగుండం కార్పొరేషన్‌లో అధికారుల వైఖరితో పలు డివిజన్లలో నాయకుల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాలకు పదవీకాలం పూర్తయిన తరువాత ప్రత్యేకాధికారుల పాలనలో పాలకవర్గ బాధ్యతలంతా అధికార యంత్రాంగమే చూసుకోవాలి.
- రామగుండంలో మాజీ కార్పొరేటర్లతో తలనొప్పి
- అభివృద్ధి పనుల్లో తలదూరుస్తున్న వైనం
- తలలు పట్టుకుంటున్న కార్పొరేషన్ యంత్రాంగం
కోల్‌సిటీ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో అధికారుల వైఖరితో పలు డివిజన్లలో నాయకుల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాలకు పదవీకాలం పూర్తయిన తరువాత ప్రత్యేకాధికారుల పాలనలో పాలకవర్గ బాధ్యతలంతా అధికార యంత్రాంగమే చూసుకోవాలి. కానీ రామగుండం నగరపాలక సంస్థలోని కొన్ని విభాగాలు ఇప్పటికీ మాజీ కార్పొరేటర్ల మాటలకే ప్రాధాన్యతనిస్తుండడంతో వివాదాలు చోటు చేసుకుం టున్నాయి. పాలకవర్గం పదవీకాలం పూర్తయి నెల రోజులు దాటినా కొందరు తామే కార్పొరేటర్లమనే భావ నలోనే ఏన్నారు. పదవీకాలం పూర్తయినా అధికారం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 50డివిజన్లు ఉన్నాయి. పాలకవర్గం పదవీకాలం జనవరి 26తో ముగిసింది. ప్రస్తుతం కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో టీయూఎఫ్‌ఐడీసీ, ఎస్‌డీఎఫ్, సింగరేణి సీఎస్‌ఆర్, 15వ ఆర్థిక సంఘం తదితర నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మేజర్ నాలాల ఆధునికీకరణ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణం తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత ఏడాది ఎన్నికలు ఇతర కారణాలతో అభివృద్ధి పనులు జరుగలేదు. కార్పొరేటర్ల పదవీకాలం పూర్తయిన తరువాత ప్రత్యేక అధికారుల పాలనలో పనులు జరుగుతున్నాయి. దీంతో డివిజన్లలో తాము పెట్టిన పనులే జరుగుతున్నాయంటూ అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి హల్‌చల్ చేస్తున్నారు. దగ్గరుండి పనులు చేయిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండడంతో వివాదాలు మొదలవుతున్నాయి. తాజా మాజీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఆశావాహుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని డివిజన్లలో అయితే పనులు జరుగుతున్న ప్రాంతంలోనే గొడవకు దిగుతున్నారు.
ఇటీవల గోదావరిఖని ఫైవింక్లయిన్‌లోని ఒక డివిజన్‌లో ఓపెన్ డ్రైన్ పనుల వద్ద తాజా మాజీ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్‌కు మధ్య జనం మధ్యనే గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఇలాంటి వివాదాలు ఇప్పుడు మెజార్టీ డివిజన్లలో చోటు చేసుకుంటున్నాయి. పని జరిగే చోట అధికారులతో వివా దాలు పడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటు న్నాయి. తాజా మాజీ కార్పొరేటర్లకు కొందరు అధికా రులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇతర నాయకులు వివాదాలు సృష్టిస్తున్నారు
అధికార పార్టీలో నేతల మధ్య వివాదాలు
రామగుండం నగరపాలక వర్గానికి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్నీ డివిజన్లలో అధికార పార్టీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లతో పాటు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు ఆయా డివిజన్లలో ప్రాతినిధ్యం ఆశిస్తున్నారు. డివిజన్లలో అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేకు అనునాయులుగా ఉన్న నాయ కులు ఈసారి తామే బరిలో ఉంటామంటూ ప్రచారం చేసుకుంటుండడంతో వివాదాలు మొదలవుతున్నాయి. డివిజన్లలో ఎమ్మెల్యే పర్యటనల సందర్భంగా కూడా ఆశావాహుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటు న్నాయి. తమకు అనుకూలమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలంటూ ఎవరికి వారుగా యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా ఉన్న రెండు డివిజన్లలో అభివృద్ధి పనుల విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. నాయకులు ఎవరికి వారుగా ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ముఖ్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి పనుల్లో జోక్యం చేసుకోవడం, అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్న సందర్భాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి.