నిరంతరంగా సంక్షేమం, అభివృద్ధి
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:44 AM
నిరంతరంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
నిరంతరంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశాన్ని ఇచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ అత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలుచేస్తూ నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో 44వేల 620 మంది రైతులకు రూ.352.74 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. జిల్లాలో రూ.73.41 కోట్ల విలువైన 1.95 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకంలో జీరో టిక్కెట్లపై ప్రయాణం చేశారన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళ శక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జిల్లాలో మూడు ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు ప్రారంభించుకోని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకంలో జిల్లాలో ఇప్పటివరకు 93 వేల 404 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ జమ చేశాన్నారు. గృహాజ్యోతి పథకంలో 9 లక్షల 44 వేల 834 కనెక్షన్లకు జీరో బిల్లులు జారీ చేశామని, ప్రభుత్వం రూ 36.36 కోట్లు చెల్లించిందన్నారు.
జిల్లాలో రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.900 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో రూ.75 కోట్లతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారన్నారు. జిల్లాలో ప్రభుత్వ దవాఖానాల ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 13861మంది రోగులకు రూ.33.63 కోట్ల విలువైన వైద్య సేవలు అందించామని, వైద్య సహాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచడం జరిగిందన్నారు. చందుర్తి, పెద్దలింగాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించామని అన్నారు. జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించిందన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 9, 10, 11, 12 పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జిల్లాలో 1531 బ్లాక్‌ల్లో 192432 ఇండ్ల సర్వే సకాలంలో పూర్తి చేశామన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది గడిచిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని అన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో విజ్ఞప్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. జిల్లా, మండలాల్లో ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కల్లు గీతా కార్మికులు చెట్టు నుంచి పడి ప్రమాదాలకు గురికాకుండా ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన కాటమయ్య రక్ష సేప్టీ కిట్‌లను జిల్లాలో 400 మంది గీత కార్మికులకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలో 440 చెరువుల్లో 70.58 లక్ష చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై అందించాలనే లక్ష్యానికి గాను 43.69 లక్షల చేప పిల్లలను నీటిలో వదిలామన్నారు.
నేతన్నలకు భద్రతా పథకాలు...
సిరిసిల్ల లోని నేతన్నలకు నేతన్న పొదుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత, పథకాలు అమలు చేస్తుందని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా బట్ట ఉత్పత్తి అర్డర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు రూ 379.85 కోట్లను చెల్లించడం జరిగిందని అన్నారు. 66 లక్షల అర్వీఎం బట్ట ఉత్పత్తి అర్డర్లు కేటాయించడం జరిగిందని అన్నారు. రూ 50కోట్లతో యారన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి విజయవంతంగా కొనసాగిస్తున్నామని అన్నారు. స్వశక్తి సంఘాల్లోని మహిళలకు అందించే చీరల ఉత్పత్తికి సంబంధించి 4.56 కోట్ల మీటర్లు సిరిసిల్లకు ప్రభుత్వం అందించిందని అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం..
జిల్లాలోని విద్యార్థులకు కామన్ డైట్ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 546 ప్రభుత్వ విద్యా సంస్థల్లో 50వేల 346 మంది విద్యార్థులు చదువుతున్నారని, 13 కస్తూర్బా విద్యాలయాల్లో 3 వేలకు పైగా విద్యార్థులకు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సు ఎంసెట్, ఇతర పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ హాస్టల్‌లలో డైట్, కాస్మెటిక్ చార్జీలు ప్రభుత్వం పెంచిందన్నారు. జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాల ద్వారా 37998 రైతుల నుంచి 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.490 కోట్లు చెల్లించామన్నారు. 1200 మంది రైతులకు సన్నరకం ధాన్యానికి సంబంధించి రూ.3.8 కోట్లు, క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్‌ను చెల్లించామని అన్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన రోడ్ల నిర్మాణాలకు రూ.18 కోట్లు సీఆర్‌ఆర్ నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంక్ నిర్మించిందని 24 మంది దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఉపాధి పొందుతున్నారని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించడంతో పాటు విజయవంతానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందిస్తున్న జిల్లా అధికారులకు, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభధ్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్‌మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విభిన్నమైన రీతిలో మన సంస్కృతి సంప్రాదాయాలు, దేశభక్తిని చాటుతూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల బృందాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌లు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు.