బీసీల జనాభాను తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:26 AM
ఒక వర్గానికి, మతానికి కొమ్ము కాసేందుకు కాంగ్రెస్ బీసీల జనాభాను తగ్గించే కుట్ర పన్నుతున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలో ఆదివారం ముగిసింది.

- కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
భగత్‌నగర్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఒక వర్గానికి, మతానికి కొమ్ము కాసేందుకు కాంగ్రెస్ బీసీల జనాభాను తగ్గించే కుట్ర పన్నుతున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరై బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషనన్లను 42 ఇస్తామని చెప్పి పది శాతం ఉన్న ముస్లింలను బీసీల్లో కలిపారన్నారు. దీంతో హిందూ బీసీలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ముస్లింలను బీసీ జాబితాలో కలిపి కేంద్రానికి పంపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. మహారాష్ట్ర్ట్రలో మాదిరిగా తెలంగాణలో మతమార్పిడిలు, లవ్‌జిహాదీలపై చట్టం తీసుకు రావాలన్నారు. రాజీవ్‌గాంధీ హిందువే కాదని, ఆయన తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ పార్సి ముస్లిం సంతతికి చెందిన వారని అన్నారు. రాజీవ్‌గాంధీ భార్య సోనియా ఇటలీ దేశ క్రైస్తవురాలని, మరి రాహుల్‌గాంధీ హిందూ ఎట్లా అవుతారని ప్రశ్నించారు. తండ్రి కులమే కొడుకుకు వర్తిస్తుందని, రాజీవ్ గాంధీ హిందువు అయినందున ఆయన కొడుకు రాహుల్ హిందువేనని కాంగ్రెస్‌నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పర్షియాలోని ముస్లిం సంతతికి చెందిన వారు భారత్‌కు వచ్చి పార్సీలుగా మారారని, ఫిరోజ్‌ఖాన్ మతమే రాజీవ్‌గాంధీకి వర్తిస్తుందని, అప్పుడు రాహుల్‌గాంధీ హిందువు ఎలా అవుతారని ప్రశ్నించారు. టెన్ జన్‌పథ్‌లోని రాహుల్‌గాంధీ కుటుంబానికి కులం, మతం, జాతి, దేశం లేవన్నారు. మోదీ పక్కా ఇండియన్ అని, మోదీకి విదేశీయులే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని తెలిపారు. విదేశాల్లో ప్రతి భారతీయుడు ‘ఇండియన్’ అని గర్వంగా కాలర్ ఎగరేసి తలెత్తుకు తిరిగేలా మోదీ చేస్తున్నారన్నారు. స్వదేశీ మేళాలను పూర్తిగా సందర్శించి ప్రతి స్టాల్‌ను తిలకించి ఉత్పత్తులను పరిశీలించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ చేస్తున్న కృషిని అభినందించారు.