Share News

టీస్టాల్‌ తొలగింపుపై ఆందోళన

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:44 AM

సిరిసిల్లలో టీస్టాల్‌ మూసివేత వివాదం రోడ్డెక్కింది.

టీస్టాల్‌ తొలగింపుపై ఆందోళన

సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో టీస్టాల్‌ మూసివేత వివాదం రోడ్డెక్కింది. బుధవారం ట్రేడ్‌ లైసెన్స్‌ లేదని మున్సిపల్‌ అధికారులు టీస్టాల్‌ను మూసివేశారు. శుక్రవారం టీస్టాల్‌ డబ్బా(కంటైనర్‌)ను తొలగించారు. దీంతో తమను రోడ్డున పడేశారంటూ టీస్టాల్‌ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి మున్సిపల్‌ గేటు ఎదుట బైఠాయించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై అభిమానంతో ఆయన పేరును పెట్టుకొని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. బుధవారం మున్సిపల్‌ అధికారులు శ్రీనివాస్‌ టీ స్టాల్‌ను మూసివేశారు. కేటీఆర్‌ ఫ్లెక్సీని తొలగింపజేశారు. ఈ విషయమై బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన తెలిపి స్టాల్‌ను తెరిపించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే శుక్రవారం పోలీస్‌ బందోబస్తు మధ్య మున్సిపల్‌ అధికారులు టీస్టాల్‌ డబ్బాలను ట్రాక్టర్‌లో తరలించి మున్సిపల్‌కు చెందినే సినారె కళామందిరం కంపౌండ్‌లో ఉంచారు. దీంతో నిర్వాహకులు శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో నిరసనకు దిగారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌లు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు. మాజీ మంత్రి కేటీఆర్‌ బాధితులతో ఫోన్‌లో మాట్లాడి పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్ష సాధింపులకు భయపడవద్దని, పార్టీ తరపున హోటల్‌ ఏర్పాటు చేయిస్తామన్నారు. త్వరలోనే వచ్చి హోటల్‌ ఓపెన్‌ చేయిస్తానని భరోసా ఇవ్వడంతో శ్రీనివాస్‌ ఆందోళనను విరమించారు.

Updated Date - Feb 22 , 2025 | 12:44 AM