హైడ్రామాకు తెర
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:27 AM
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో హైడ్రామాకు తెరపడింది. మెజిస్ట్రేట్ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

- హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- పూచీకత్తు సమర్పించిన అనంతరం విడుదల
కరీంనగర్ క్రైం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో హైడ్రామాకు తెరపడింది. మెజిస్ట్రేట్ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల శాసన సభ్యుడు సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా హుజూరాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు, వాడిన పదజాలం గలాటాకు దారి తీసింది.
ఫ రెండు కేసులు నమోదు..
కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల శాసన సభ్యుడు శాసన సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సంజయ్‌కుమార్‌ను సమావేశంలో మాట్లాడకుండా అడ్డకోవడంతో పాటు చేయిచేసుకుని అవమానించారని ఆయన పీఏ కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై కరీంనగర్ ఆర్డీవో కె మహేశ్వర్, సమావేశానికి హాజరవుతున్న సమయంలో పాడి కౌశిక్‌రెడ్డి తనను దుర్భాషలాడుతూ అడ్డుకోవడంతోపాటు కాలర్ పట్టుకుని అవమానపరిచాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సంజయ్‌కుమార్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేల వాంగ్మూలాలను ఈ సంఘటనకు సాక్ష్యాలుగా పోలీసులు సోమవారం సేకరించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌కు తీసుకువస్తున్నారనే విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులతో పాటు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ ఒకటొ ఠాణా వద్దకు చేరుకున్నారు.
ఫ సీపీటీసీకి.. త్రీ టౌన్‌కు.. మెజిస్ట్రేట్ ఎదుటకు..
కౌశిక్‌రెడ్డిని పోలీసులు మొదట కరీంనగర్ సీపీటీసీకి అనంతరం మూడో ఠాణాకు తరలించి అక్కడే రాత్రంతా అక్కడే ఉంచారు. సోమవారం ఉదయం 8‘:30 గంటల సమయంలో కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎం హేమలత ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ వద్ద ఎమ్మెల్యే తరపున బీఆర్‌ఎస్ లీగల్‌టీం, న్యాయవాది ఇ మధుసూదన్‌రావు, సర్దార్ రవీందర్‌సింగ్ మరో ఇద్దరు వాదనలు వినిపించారు. పోలీసుల తరపున ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గంటకుపైగా తమ వాదనలు వినిపించారు. చివరకు కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించవద్దని, రెండు కేసుల్లో 50 వేల రూపాయల చొప్పున పూచీకత్తులు సమర్పించాలన్నారు. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష రూపాయల పూచీకత్తులు సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఈ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవిస్తానని, తాను మీడియా సమావేశంలో మాట్లాడరాదన్నారు. పండగపూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నట్లు తెలిపారు. తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.