పత్తి కొనుగోళ్లలో సీసీఐదే పైచేయి
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:57 AM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో ఈసారి పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పైచేయి సాధించింది. ప్రైవేట్ ట్రేడర్స్ కంటే 70,240 క్వింటాళ్లు అధికంగా పత్తిని కొని నాలుగేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2019లో ప్రైవేట్ కంటే 400 క్వింటాళ్లు సీసీఐ అధికంగా కొనుగోలు చేసింది.

జమ్మికుంట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో ఈసారి పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పైచేయి సాధించింది. ప్రైవేట్ ట్రేడర్స్ కంటే 70,240 క్వింటాళ్లు అధికంగా పత్తిని కొని నాలుగేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2019లో ప్రైవేట్ కంటే 400 క్వింటాళ్లు సీసీఐ అధికంగా కొనుగోలు చేసింది. 2024 అక్టోబరు 23న సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించింది. అప్పటి నుంచి నవంబరు 20 వరకు నామమాత్రంగా కొనుగోలు చేసింది. యార్డులో అప్పటి వరకు ప్రైవేట్ వ్యాపారులదే హవా కొనసాగింది. క్వింటాల్‌కు అత్యధికంగా 6,800 రూపాయల ధర చెల్లిస్తూ వచ్చారు. ప్రభుత్వ మద్ధతు ధర 7,521 ఉండగా, క్వింటాల్‌కు 721 రూపాయలు రైతులు నష్ట పోవాల్సి వచ్చింది. నవంబరు 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లలో దూకుడు పెంచింది. రెండు నెలల వ్యవధిలో 1.72 లక్షల క్వింటాళ్ల పత్తి కొన్నది. ప్రైవేట్ వ్యాపారులు ఇప్పటి వరకు 1,01,760 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ప్రైవేట్ కంటే సీసీఐ అధిక మొత్తంలో కొనుగోళ్లు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ సీసీఐ, ప్రైవేట్ కొనుగోళ్లు పారదర్సకంగా జరిగాయి
- ఆర్ మల్లేశం, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేట్ ట్రేడర్స్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టారు. మేము ఎప్పటికప్పుడు కొనుగోళ్లను దగ్గరుండి పర్యవేక్షించాం. ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రేడర్స్ కంటే సీసీఐ కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. సీజన్ ప్రారంభంలో పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల సీసీఐ కొనలేదు. తేమశాతం తగ్గిన తర్వాత సీసీఐ కొనుగోళ్లలో వేగం పెంచింది.
2019-20 నుంచి జమ్మికుంట మార్కెట్‌లో పత్తి కొనుగోళ్ల వివరాలు
=======================================================
సంవత్సరం ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ
(క్వింటాళ్లలో..) (క్వింటాళ్లలో..)
=========================================================
2019-20 2,38,900 2,39,300
2020-21 1,66,000 58,500
2021-22 2,83,100 ----------
2022-23 5,09,900 -----------
2023-24 5,00,340 78,450
2024-25 1,01,760 1,72,000
(జనవరి 10 వరకు)