Share News

రైతులపై బీఆర్‌ఎస్‌ మొసలి కన్నీరు..

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:55 AM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నీరు వాడుకోకుండా ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌ నీటిని 9వ ప్యాకేజీ కాల్వద్వారా రైతులకు అందిస్తున్నామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రైతులపై బీఆర్‌ఎస్‌ మొసలి కన్నీరు..

ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నీరు వాడుకోకుండా ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌ నీటిని 9వ ప్యాకేజీ కాల్వద్వారా రైతులకు అందిస్తున్నామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. దీన్ని స్వాగతించాల్సింది పోయి బీఆర్‌ఎస్‌ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మం డలం అల్మాస్‌పూర్‌ గ్రామ శివారులోని 9వ ప్యాకేజీ కాల్వకు సరఫరా అవుతున్న నీటిని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగంలతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎగువ ప్రాంత రైతులకు సాగు నీరందించే 9వ ప్యాకేజీ కాల్వ పనులను పూర్తిచేయడంలో కేటీఆర్‌ విఫలమయ్యారన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌లకు నీటిని తరలించుకుపోయిన ఎందుకు పట్టించుకోలేరని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద కుంగిపోయి సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో వరద నీటిని నిల్వచేస్తే ప్రమాదం పొంచి ఉంటుందని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారులు ఆదేశిస్తే గేట్లు ఎత్తి వేయడం వల్ల నీరంతా సముద్రంలో కలిసిపోయింద న్నారు. గత బీఆర్‌ఎస్‌ కాళేశ్వరం నీటితో 1.30లక్షల మెట్రిక్‌ టన్ను ల వరి ధాన్యం పండితే గొప్పలు చెప్పుకున్నారన్నారు. కుంగిపోయిన కాళేశ్వరం నీటిని వాడుకోకుండానే నాటి కాంగ్రెస్‌ హయాం లో నిర్మించిన ప్రాజెక్ట్‌ల ద్వారా సాగు నీటిని అందించి 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారన్నారు. సాగు నీటిని తీసుకువచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు క్షీరాభిషేకం చేయాలని సూచించారు. మల్కపేట నుంచి సింగసముద్రం చెరువు వరకు కాల్వ ద్వారా నీటిని అందిం చామని రానున్న రోజుల్లో ఎత్తిపోతలతో ఎగువ మానేరు జలాశయా న్ని నింపుతామని ఆది శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, లక్ష్మారెడ్డి, గౌస్‌, రాంరెడ్డి, రాజయ్య, బాలయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, బాబు, బుచ్చాగౌడ్‌, శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి, అంజయ్య, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:55 AM