ఎన్‌హెచ్-63 పనులకు బ్రేక్
ABN , Publish Date - Jan 22 , 2025 | 01:33 AM
నిజామాబాద్-జగిత్యాల- మంచిర్యాల జిల్లాల్లో జాతీయ రహదారి-63 విస్తరణ పనులకు బ్రేక్ పడింది. పనులను ఎక్కడికక్కడే నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరిట పనులకు అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే.
జగిత్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్-జగిత్యాల- మంచిర్యాల జిల్లాల్లో జాతీయ రహదారి-63 విస్తరణ పనులకు బ్రేక్ పడింది. పనులను ఎక్కడికక్కడే నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరిట పనులకు అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. గతంలో ఉన్న రోడ్డును విస్తరించడంతో పాటు అనుకూలంగా లేనిచోట కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమిని సేకరించాలని నేషనల్ హైవే అథారిటీని ఆదేశించింది. ఇందులో భాగంగా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీలకు దూరంగా గుట్టలు, పట్టా భూముల గుండా సాగేలా అలైన్‌మెంట్ రూపొందించారు. దీని ప్రకారం నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌లోని ఎన్‌హెచ్-44 నుంచి ప్రారంభమయ్యే రహదారి పలు గ్రామాల గుండా సాగుతూ జగిత్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జిల్లా సరిహద్దు ప్రాంతంలోని బండలింగాపూర్ గండి హనుమాన్ దేవస్థానం నుంచి మేడిపల్లి పడమర, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గోదావరి వంతెన మీదుగా మంచిర్యాల జిల్లా వైపు వెళ్తుంది.
ఫయాక్సెస్ కంట్రోల్ ప్రాజెక్టుగా ఆర్మూర్-మంచిర్యాల రహదారి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి జగిత్యాల జిల్లా మీదుగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి వరకు నిర్మించనున్న జాతీయ రహదారిని యాక్సెస్ కంట్రోల్ ప్రాజెక్టుగా విస్తరించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగ్ధల్‌పూర్ వరకు ఎన్‌హెచ్-63ను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. లారీలు, భారీ ట్రక్కులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండే ఈ జాతీయ రహదారి రెండు వరుసలతో ఇరుకుగా ఉండి నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మెట్‌పల్లి, కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల, లక్షెట్టిపేట పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగితా ప్రాంతాల్లో రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. సుమారు 131.8 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ మార్గం అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 69.300 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 30.900 కిలో మీటర్లు, మంచిర్యాల జిల్లాలో 41.813 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు నిర్వహించడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్‌లో 14 కిలోమీటర్లు, కోరుట్ల డివిజన్‌లో 17 కిలోమీటర్లు, జగిత్యాల డివిజన్‌లో 38 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి విస్తరణ జరపనున్నారు. ఈ మార్గంలో 6 నుంచి 12 కిలోమీటర్ల మేర భారీ బైపాస్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఇవేకాకుండా సుమారు ఎనిమిది ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లను నిర్మించనున్నారు. రహదారి క్రాసింగ్‌ల వద్ద ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ మార్గంలో దాదాపు 46 వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు ఉంటాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.3,850 కోట్లు కాగా వ్యయం మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల వద్ద 63వ నంబరు జాతీయ రహదారి నాగ్‌పూర్ - విజయవాడ 363 జాతీయ రహదారితో అనుసంధానం చేయడానికి అనుగుణంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.
ఫహైకోర్టును ఆశ్రయించిన రైతులు
ఎన్‌హెచ్-63 కోసం అధికారులు పలు దఫాలుగా రూట్ మ్యాప్‌లో మార్పులు చేశారు. మొదటి అలైన్‌మెంట్ ప్రకారం కొందరు బడా బాబులకు నష్టం వాటిల్లుతుండటంతో వారి ఒత్తిడికి తలొగ్గి రెండో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. తొలుత ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారినే నాలుగు వరసలుగా విస్తరించడానికి నిర్ణయించారు. మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీల గుండా జాతీయ రహదారి వెళ్తుండడంతో రహదారికి ఇరువైపుల గల దుకాణాలు, ఇళ్లు, ఇతర కట్టడాలు నష్టపోయే ప్రమాదం ఉండడంతో పరిహారం భారం అవుతుందని బావించారు. దీంతో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీల గుండా కాకుండా శివారు ప్రాంతాల్లో బైపాస్ రహదారిని నాలుగు వరసలుగా నిర్మించాలని రూట్ మ్యాప్ రూపొందించారు. ఈమేరకు రూపొందించిన అలైన్‌మెంట్‌తో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. గ్రీన్ ఫీల్డ్ బైపాస్ రహదారి వల్ల రూ.కోట్లు విలువ చేసే భూములు నష్టపోవాల్సి వస్తోందని పలు గ్రామాల రైతులు ఆందోళనలు చేపట్టారు. కలెక్టర్‌తో పాటు ఆర్‌డీఓలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను సమర్పించారు. ఆయా గ్రామాల ప్రజలు సర్వే పనులను అడ్డుకోవడం, భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పలు రకాల ఆందోళనలు నిర్వహించారు. బైపాస్ రహదారి నిర్మాణాలకు కొత్త అలైన్‌మెంట్‌తో జీవనాధారామైన సాగు భూములను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అలైన్‌మెంట్ ప్రకారం భూ సేకరణ కోసం అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో వెల్లుల్ల, బండలింగాపూర్, మేడిపల్లి పడమర గ్రామాల్లో పంట పొలాలు, చేల మీదుగా రహదారి నిర్మాణం జరపడానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంత రైతులకు చెందిన భూములు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ నిర్మాణం, రాజేశ్వర్ రావుపేట పంప్‌హౌజ్ నిర్మాణం, రైల్వే లైన్ నిర్మాణంలో ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యాయి. మిగిలిన కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్లీ రహదారి నిర్మాణం కోసం తమ భూములు సేకరిస్తుండటంతో వారంతా ఆందోళనబాట పట్టారు. తమకు నష్టం కలిగించే రూట్‌మ్యాప్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో మేడిపల్లి (పడమర), వెల్లుల్ల, బండలింగాపూర్ తదితర గ్రామాలకు చెందిన ఎనిమిది రైతులు హైకోర్టుకు వెళ్లారు.
ఫపనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
రైతుల పక్షాన జిల్లాలోని వెల్గటూర్‌కు చెందిన న్యాయవాది దోరిశెట్టి పోచయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఎన్‌హెచ్-63 పనులు ఆపాలని డబ్ల్యూపీ/1500/2025 ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌హెచ్ అథారిటీ యాక్ట్ ప్రకారం అధికారులు విధానాలను అమలు చేయలేదని, రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఎన్‌హెచ్-63 పనులు ఆపాలని మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న రహదారిని ఆనుకొని నాలుగు వరసల రహదారిని నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
హైకోర్టు తీర్పు హర్షణీయం
-పొడేటి రాముగౌడ్, హైకోర్టును ఆశ్రయించిన రైతు, మేడిపల్లి (పడమర)
రైతులకు ఉపాధి లేకుండా చేసే జాతీయ రహదారి విస్తరణ పనులను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. కాళ్లరిగేలా అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగిన రైతులకు సరియైన న్యాయం లభించింది.
న్యాయం గెలిచింది
-గిరి బాబు, బాధిత రైతు
అధికారుల చర్యలు ఏడాది కాలంగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భూములు ఇవ్వమని చెప్పినా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే కోర్టును ఆశ్రయించాం. కోర్టు తీర్పు ద్వారా న్యాయమే గెలిచింది.
రైతులకు అన్యాయం జరగొద్దు
- దోరిశెట్టి పోచయ్య, హైకోర్టు న్యాయవాది, వెల్గటూరు
భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతుల గోడును పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఉన్న భూములన్నీ రహదారి పేరిట లాగేసుకుంటే వాళ్లు ఎలా బతకాలి. నేషనల్ హైవే అథారిటీ యాక్ట్ ప్రకారం కూడా చెల్లింపులు చేయడం లేదు. అందుకే రైతుల పక్షాన న్యాయస్థానంలో వాదనలు వినిపించా. బాధిత రైతులు ఎవరైనా 9885282923 సెల్‌నంబరులో సంప్రదిస్తే తగిన న్యాయ సహాయం అందజేస్తా.