Share News

భక్తజన సంద్రం... రాజన్న క్షేత్రం

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:44 AM

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కొమరవెళ్లి మల్లన్న వారంపట్నంను పురస్కరించుకుని వేములవాడ రాజన్నకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.

భక్తజన సంద్రం... రాజన్న క్షేత్రం
రాజన్న దర్శనం కోసం క్యూలైన్‌లో నిరీక్షిస్తున్న భక్తులు

- ఆలయానికి పోటెత్తిన భక్తులు

- దర్శనానికి నాలుగు గంటల సమయం

వేములవాడ కల్చరల్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కొమరవెళ్లి మల్లన్న వారంపట్నంను పురస్కరించుకుని వేములవాడ రాజన్నకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముందుగా కల్యాణకట్టలతో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకునే భక్తులు క్యూలైన్‌లో నాలుగు గంటలపాటు నిరీక్షించారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లో భక్తులతో కిక్కిరిసిపోయాయి. బ్రేక్‌దర్శనం క్యూలైన్‌లు కూడా నిండిపోయాయి. అమ్మవారికి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమెక్కు చెల్లించుకున్నారు.

- బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు..

రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో జిల్లా బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ టీం సభ్యులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఆలయ పరిసరాలతో పాటు పార్కింగ్‌ స్థలాలు, వసతిగదులతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

- స్మార్ట్‌ టీవీల ఏర్పాటు..

రాజన్న ఆలయంలో నిర్వహించే పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయానికి వచ్చే భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ ఈవో వినోద్‌రెడ్డి పలు ప్రాంతాల్లో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ లడ్డుల కౌంటర్‌, కోడెమొక్కు క్యూలైన్‌లతో పాటుగా పలు ఓపెన్‌ స్థలాల్లో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేయగా రాజన్న ఆలయంలో భక్తులు ఎక్కువగా ఉండే స్థలాల్లో భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భారీ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 21 , 2025 | 12:44 AM