Share News

అంగన్‌వాడీల్లో కొలువులు

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:14 AM

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంగన్‌వాడీల్లో కొలువులు

జగిత్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు (ఆయా) పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. జిల్లాలో పలు కారణాలతో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను కొన్ని సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు. కొందరు టీచర్లకు అదనపు కేంద్రాలను అప్పగించగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న కేంద్రాల నిర్వహణ సూపర్‌వైజర్లకు, సీడీపీఓలకు ఇబ్బందిగా మారింది. ఖాళీలను భర్తీ చేస్తే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉంది.

జిల్లాలో ఖాళీల వివరాలు

జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లి, మల్యాల, ధర్మపురిలలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,065 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు మంజూరు కాగా 1,002 పోస్టులు భర్తీ అయి ఉన్నాయి. ఇంకా 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 1,065 అంగన్‌ వాడీ టీచర్‌ పోస్టులు మంజూరు కాగా 747 పోస్టుల్లో ఆయాలు పనిచేస్తున్నారు. ఇంకా 318 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ధర్మపురి ప్రాజెక్టు పరిధిలో 222 టీచర్‌ పోస్టులకు గాను 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 222 ఆయా పోస్టులకు గాను 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జగిత్యాల ప్రాజెక్టు పరిధిలో 304 టీచర్‌ పోస్టులకు గాను 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 304 ఆయా పోస్టులకు గాను 97 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్యాల ప్రాజెక్టు పరిధిలో 227 టీచర్‌ పోస్టులకు గాను 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 227 ఆయా పోస్టులకు గాను 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో 312 టీచర్‌ పోస్టులకు గాను 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 312 ఆయా పోస్టులకు గాను 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మంత్రి సీతక్క ప్రకటనతో ఆశలు

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనరి అనసూయ సీతక్క అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీపై ఇటీవల చేసిన ప్రకటన నిరుద్యోగ యువతుల్లో ఆశలు చిగురింపజేశాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 14 వేలకు పైగా అంగన్‌వాడీ టీచర్‌, ఆయా నియామకాల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటిచారు. అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకు గతంలో పదో తరగతి ఉత్తీర్ణత కావాలన్న నిబంధన ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ టీచర్‌తో పాటు ఆయా పోస్టుకు కనీసం ఇంటర్‌ పాసై ఉండాలన్న నిబంధన ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

ఖాళీల వివరాలను గుర్తించాం

-బోనగిరి నరేశ్‌, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల వివరాలను గుర్తించాం. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న కేంద్రాల నుంచి టీచర్లను, ఆయాలను సర్దుబాటు చేశాం. సూపర్‌వైజర్లతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం.

Updated Date - Mar 07 , 2025 | 01:14 AM